ఆ ‘సగం’ లేనిదే ‘మనం’ లేం!

24 Apr, 2015 00:20 IST|Sakshi
ఆ ‘సగం’ లేనిదే ‘మనం’ లేం!

మూడు దశాబ్దాలుగా ఆడపిల్లల పట్ల చూపిన వివక్ష ఫలితంగా... మగపిల్లవాడి పెళ్లి నేడు తల్లి దండ్రులకు సవాల్‌గా మారింది. 20-45 ఏళ్ల మధ్య వయస్కులైన 4.12 కోట్ల మంది పురుషులు నేడు బలవంతపు బ్రహ్మచర్యం పాటించాల్సివస్తోంది! ముందు ముందు పరిస్థితులు ఇంకెలా ఉంటాయో ఊహించుకోవాల్సిందే. ఆర్థిక సరళీకరణ, గ్లోబలీకరణ విధానాలు అమలవుతున్న క్రమంలోనే ఆడపిల్ల పట్ల వివక్ష విపరీతంగా పెరిగింది. అంటే శాస్త్ర సాంకేతికతతో ముందుకు నడుస్తున్నామనుకుంటూనే, ఆలోచనలపరంగా మనం వెనక్కి నడుస్తున్నట్టే లెక్క.
 
 మహిళా సాధికారత గురించి పాలకులు మహా జోరుగా ఉపన్యాసాలు దంచే ప్రస్తుత పరిస్థితుల్లో కూడా క్షేత్ర స్థాయి వాస్తవాలు గగుర్పాటు కలిగి స్తున్నాయి. కరడుగట్టిన పురుషాధిక్య సమాజంలో మహిళా సాధికారత సమీప భవిష్యత్తులోనే కాదు, ఎన్నటికైనా సాధ్యమేనా? అని సందేహం కలుగుతోంది. మహిళను మననిస్తారా? అనే భయసందేహాలు కలుగు తున్నాయి. మహిళల పట్ల పురుషుల ఆలోచనా ధోరణిలో మార్పు రానంత వరకు మహిళా స్వేచ్ఛ, మహిళా స్వాతంత్య్రం, మహిళా సాధికారత ఉపన్యా సాలకు పనికొచ్చే ఊతపదాలుగా, సర్కారు కంటితుడుపు పథకాల్లో అందంగా ఒదిగే పారిభాషక పదాలుగానే మిగిలిపోతాయి.

ప్రత్యేకావకాశాల సంగతలా ఉంచి మహిళల సహజ ఎదుగుదలకు అవకాశాల్ని కూడా కర్కశంగా నలిపేస్తున్న వాతావరణం సర్వత్రా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నిన్నటికి నిన్న కూకట్‌పల్లిలో తన ప్రేమను నిరాకరించిందని ఓ యువతిపై హత్యాయత్నం చేసిన ఉన్మాది హతుడైన ఘటన నుంచి...ఓ ఎయిర్ హోస్టెస్‌ను భర్తే హతమార్చిన ఘటన వరకు ఈ దుర్మార్గాలను ఎన్నని చెప్పగలం? పుట్టబోయేది ఆడపిల్లే అని తెలిసి గర్భంలోనే చిదిమేయడం, ఆ దశదాటి పుట్టినా సజీవంగానే కుప్పతొట్టెల్లో విసిరేయడం, పుట్టిన్నుంచి ఆడపిల్లని అంగడి సరుకులా అమ్మేయడం, సంప్రదాయపు కట్టుబాట్లతో ఆడపిల్ల ఎదుగుదలను అడుగడుగునా కట్టడి చేయడం, యుక్తవయసులో ప్రేమా గీమా అని వేధించి, మాట చెల్లుబాటు కాలేదని రాక్షసంగా చిదిమే యడం, పెళ్లయ్యాక వరకట్నం వేధింపులతో, ఆధిపత్యం సతాయింపులతో అంతమొందించడం ... ఇవన్నీ నేటి మహిళ దయనీయ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.

ఎంత ఆధునికత వైపు నడుస్తున్నా మహిళల పట్ల ఆలోచనలు మెరుగుపడకపోగా, మరింత దిగజారుడుతనమే కనిపిస్తోంది. ఏయేటి కాయేడు మహిళల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నా ఎవరికీ పట్టడం లేదు. చట్టబద్దమైన సంస్కరణలు, చిత్తశుద్దితో కూడిన ఆచరణ ఉంటే తప్ప ఆడపిల్లకు రక్షణ లేదేమో అనిపిస్తోంది.


 ఈ గణాంకాలు దేనికి సంకేతం!
 దేశంలో లింగ నిష్పత్తి ప్రమాదకరంగా మారుతోంది. సగటున ప్రతి వెయ్యి మంది పురుషులకు 933 మంది మాత్రమే మహిళలున్నారు. ఇంతకన్నా ప్రమాదకరమైన పరిస్థితి మున్ముందున్నదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మూడు దశాబ్దాల క్రితం తల్లిదండ్రులు ఆడపిల్లల పట్ల వివక్షతో అనుసరిం చిన పద్ధతుల ఫలితంగా... యువకులకు తమ ఈడు ఆడపిల్లలు దొరకని పరిస్థితి నెలకొంది. ఒకప్పటి పరిస్థితి తారుమారై... మగపిల్లవాడి పెళ్లి తల్లి దండ్రులకు సవాల్‌గా మారింది.

అయినా ఆడపిల్ల పుట్టుకను ఈసడించు కుంటున్న స్థితిలో.... ఇరవై, ముఫ్ఫై ఏళ్ల తర్వాత పరిస్థితులు ఇంకెంత భయంకరంగా ఉంటాయో ఊహించుకోవాల్సిందే. నేడు 20-30 ఏళ్ల యువకులకు భార్య ఉందంటే అదృష్టవంతుల కిందే లెక్క. ఆ వయసు యువకులు దేశంలో 5.63 కోట్ల మంది ఉంటే, అదే వయసు యువతులు 2.07 కోట్లు మాత్రమే ఉన్నారు. అలాగే 30లలోని (30-40 ఏళ్లు) పురుషులు 70.1 లక్షల మంది ఉంటే, ఆ వయసులో ఉన్న మహిళలు 22.1 లక్షల మంది మాత్రమే ఉన్నారు.

40లలో కూడా ఇటువంటి వ్యత్యాసమే ఉంది. మన జనాభా లెక్కల్లో లింగ వ్యత్యాసాల్ని విశ్లేషించినపుడు ఈ గణాంకాలు బయటపడ్డాయి. అంటే మొత్తమ్మీద వివాహం కాని పురుషులు (20-45) 6.50 కోట్ల మంది ఉంటే, అదే వయో పరిమితిలోని అవివాహిత స్త్రీలు 2.38 కోట్లు మాత్రమే ఉన్నారు. 4.12 కోట్ల మంది పురుషులు బలవంతపు బ్రహ్మచర్యం పాటిస్తున్నట్టే. ఏ మ్యారేజీ బ్యూరోలో వాకబు చేసినా ఈ పరిస్థితి తేటతెల్లమౌతుంది. ఒకప్పుడు, ‘ఇంట్లో పెళ్లికెదిగిన అమ్మాయి ఉంది, తెలిసిన వాళ్లుంటే కాస్త సంబంధాలు చూసి పెట్టండి’ అని తల్లిదండ్రులు వాకబు చేసేవారు. ఇప్పుడు ‘మీ ఎరుకలో అమ్మాయిలున్నారా ఎక్కడైనా? మా వాడూ...’ అనే వినతులు ఎక్కువయ్యాయి!


 ఎవరి పాపం ఎవరికి చుట్టుకుంటోంది!
 పుట్టబోయే బిడ్డ ఆడనా, మగనా అని తేల్చే లింగ నిర్ధారణ పరీక్షలు మన దేశంలో 1970 దశకంలో మొదలై, 1980 దశకంలో పెచ్చు పెరిగాయి. ఆర్థిక సరళీకరణ విధానాలు, గ్లోబలీకరణ మనిషి ఆలోచనా ధోరణిని మార్చిన క్రమంలోనే ఆడపిల్ల పట్ల వివక్ష విపరీతంగా పెరిగింది. ఈ మూడు దశాబ్దాల్లోనూ ఆడపిల్లల్ని నిర్మూలించే దుశ్చర్యలు విచ్చలవిడిగా జరిగాయి. తల్లి కడుపున ఉండగానేనో, పుట్టీపుట్టగానేనో ఆడపిల్లల ప్రాణాలను చిదిమేసిన దుష్ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

లింగనిర్ధారణ పరీక్షలు జరపడం, వాటి ఫలితాలను తల్లిదండ్రులకు తెలియపరచడం నేర మని చెప్పే చట్టాలున్నా గోప్యంగా అవి జరుగుతూనే ఉన్నాయి. ‘‘ఈ సాంకేతిక వైద్య సదుపాయం రాను రాను గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించిం దని, కఠినమైన చర్యలు తీసుకోకుంటే ఇది 2021 నాటికి దుర్మార్గమైన స్థితికి చేరుతుంది’’ అని ‘గర్భ-గర్భస్థశిశు సాంకేతిక పరీక్షల (పీసీపీఎన్‌డీటీ) చట్టం’ పర్యవేక్షణ కమిటీ సభ్యురాలైన డాక్టర్ నీలమ్ సింగ్ అన్నారు. శాస్త్ర సాంకేతి కతతో ముందుకు నడుస్తున్నామనుకుంటూనే మనం పెడదారి పట్టిన ఆలోచనలతో కచ్చితంగా వెనక్కి నడుస్తున్నట్టే లెక్క. ‘‘1980లలో పుట్టిన వారూ మా దగ్గరికి వస్తుంటారు.

కానీ వారికి అనువైన మ్యాచెస్ దొరకవు. కులం, చదువు, ఆస్తి, వయసు....ఇలా పలు విషయాల్లో రాజీపడతామం టారు. అయినా వధువులు దొరకరు’’ అని హైదరాబాద్‌లో మ్యారేజీ బ్యూరో నిర్వహించే ఓ పెద్దమనిషి తెలిపారు. 1901లో ప్రతి వెయ్యి మంది పురుషులకు 972 మహిళలు ఉండేవారు. సహజ నిష్పత్తి 1000: 954 కన్నా ఇది మెరుగైన స్థితి. ప్రతి వెయ్యి మంది పురుషులకు 1970లలో 930 మహిళలున్నారు. 1980లలో అది 934 కాగా 1990లలో ఆ సంఖ్య 927కు పడిపోయింది. 2000లలో అది 933 గా నమోదయింది.


 ఆలోచనా ధోరణిలోనే లోపం
 మహిళల పట్ల మన ఆలోచనా ధోరణిలోనే లోపముంది. పురుషాధిక్య వ్యవస్థలో వారిని నిమ్న లింగంగా పరిగణించే తత్వం బలంగా వేళ్లూనుకొని ఉంది. తల్లిదండ్రుల నీడలో ఆడుకునే పిల్లల నుంచి నేడో రేపో ప్రాణాలు విడిచే ముసలి వాళ్ల వరకు అదే ఆధిపత్య ధోరణి, అదే వివక్ష కొనసాగిస్తుంటారు. అన్ని సందర్భాల్లోనూ వారిని తక్కువ చేసి చూడటం రివాజుగా మారింది. స్త్రీ,పురుషలు చేసే ఒకే పనికి ఇచ్చే కూలి డబ్బులు, వేతనాల నుంచి అన్ని స్థాయిల్లోనూ ఈ వ్యత్యాసాలుంటాయి. పని ప్రదేశాల్లోని వివక్ష, అవమానాలు మహిళల్ని ప్రాణాంతక స్థితికి నెడుతున్నాయి.

వారసత్వ ఆస్థిలో పురుషులతో సమానంగా స్త్రీలకు ఆస్తి హక్కు కల్పింటే చట్టం ఉన్నా, ఆచరణలో ఎక్కడా అది జరగదు. సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వారి అర్హతలకు తగ్గ అవకాశాలను కల్పించకపోగా సహజ సిద్ధంగా సంక్రమించిన హక్కుల్ని కూడా కాలరాస్తున్నారు. మరణించిన తల్లి చితికి నిప్పంటించినందుకు ఓ మహిళను స్వయానా సోదరుడే హతమార్చిన ఘటన చత్తీస్‌ఘడ్ లోని రాయ్‌పూర్ జిల్లా మోదలో ఇటీవల సంచలనం సృష్టించింది.

ఆమె గ్రామ సర్పంచ్ కూడా! పదవులు, హోదాలతో నిమిత్తం లేకుండా మహిళా హక్కుల కాలరాచివేత సాగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో మహిళకు సాధికారత కల్పిస్తామనే రాజకీయ ప్రసంగాలకు అర్థమే లేకుండా పోతోంది. అత్యున్నత చట్టసభల్లో మూడో వంతు రిజర్వేషన్లు కల్పిస్తామనే ప్రతిపాదన గడచిన దశాబ్ద కాలంగా పార్లమెంటులోనే నగుబాటుకు గురవుతోంది.

మన రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉన్నా, మెజారిటీ స్థానాల్లో మహిళల్ని నామ మాత్రం చేసి వారి భర్తలో, తండ్రులో, సోదరులో, ఇతర పెత్తందార్లో పెత్తనం చెలాయించడం పరిపాటి. మహిళలు, మహిళా సంఘాల పేరుతో ఇసుక క్వారీల బాధ్యతలను ఇచ్చినట్టున్నా తెరవెనుక పాలకపక్ష నేతలు చేసేదేమిటో అందరికీ తెలుసు. తండ్రి తర్వాత తనకు దక్కాల్సిన వారసత్వ పూజారిత్వం హక్కు కోసం ఓ మహిళ కోర్టుకు వెళ్లి సాధించుకోవాల్సి వచ్చింది. పైగా పోలీసు బందూకుల రక్షణ మధ్య మాత్రమే ఆమె పూజాదికాలు జరపాల్సి వచ్చింది. ఇదీ, మన వాళ్లు జబ్బలు చరచుకొని ప్రచారం చేసే మహిళా సాధికారత!


 ప్రచారం, ఆచరణ, సంస్కరణలతోనే పరిష్కారం
 ఆడ, మగ అనే తేడా సృష్టి పరమైన సహజ వైవిధ్యమే తప్ప ఇరువురూ సరిసమానమనే భావనల్ని పిల్లల్ని పెంచేప్పుడే తలిదండ్రులు వారిలో నాటాలి. స్త్రీలను గౌరవించే మన సంస్కృతీ సంప్రదాయాల్ని వివరించాలి. ప్రభుత్వపరంగా కూడా నిర్దిష్ట ప్రణాళికలను రూపొందించి సంస్కరణల్ని కఠినంగా అమలుపరచాలి. ఇప్పటికే ఉన్న అరకొర చట్టాల్నైనా పకడ్బందీగా అమలు చెయ్యాలి. తగు ప్రచారం ద్వారా సాధించే సామాజిక పరివర్తనే కీలకం.

అందం, నాట్యం, అణుకువ... కోసం ఆడపిల్ల పాదం విశాలంగా విస్తరించకూడదని చైనాలో ఒకప్పుడు శిశువులుగా ఉన్నపుడే వారి పాదాలు పెరగకుండా కట్టుకట్టేసేవారు. ఈ దురాచారాన్ని నిర్మూలించడానికి విసృ్తతమైన ప్రచారం జరిగింది. ఒక దశలో, పాదం కట్టుకట్టి పెంచిన ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోకూడదనే ఆంక్షనూ విధించారు. క్రమంగా ఆ పాదం కట్టు దురాచారం రూపు మాసిపోయింది. చట్టాల కన్నా సాంఘిక చైతన్యంతోనే మనం ఒకప్పుడు సతీసహగమనాన్ని రూపు మాపగలిగాం. ఆడపిల్లని కాపాడ్డానికి అలాంటి సామాజిక పరివర్తన రావాలి. అర్జెంటీనా వంటి లాటిన్ అమెరికా దేశాల్లో మహిళలకి చట్ట సభల్లో మూడోవంతు స్థానాలను రిజర్వు చేసిన తర్వాత గణనీయమైన మార్పులొచ్చాయి. అది మనకు ఆదర్శం కావాలి.


విధాన నిర్ణయాల్లో చొరవ, శాస్త్ర, సాంకేతికతలు ఉత్ప్రేరకాలుగా మహిళాభ్యుదయం సాధించవచ్చని అనేక అభివృద్ధిచెందిన, చెందుతున్న దేశాలు నిరూపించాయి. తైవాన్‌లో వస్తూత్పత్తికి ప్రాధాన్యత నిచ్చి మహిళలకు తగు ప్రాతినిధ్యం కల్పించిన తర్వాత వారి సాధికారత బాగా పెరిగింది. పెరూ దంపతులిద్దరికి ఉమ్మడిగా భూయాజమాన్య హక్కులను కల్పించడంతో విప్లవాత్మకమైన మార్పులొచ్చాయి. మహిళలకు ఉద్యోగ, ఉపాధి, ఆర్థికావకాశాలను కల్పించడం ద్వారా సమాజంలో వారి స్థాయి బాగా పెరిగింది. మనం ఆ అనుభవాలన్నిటినీ క్రోడీకరించి సర్వశక్తులా కృషి చేసి ఆడపిల్లను కాపాడుకోవాలి. స్త్రీ శక్తిని, మహిళా సాధికారతను మనవా భ్యున్నతికి దోహదపడేలా చేయాలి. ఆకాశంలోనే కాదు నేల మీదా సగం నువ్వు సగం నేను.

దిలీప్ రెడ్డి, సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్
ఈమెయిల్: dileepreddy@sakshi.com   
                   

మరిన్ని వార్తలు