కమల్‌... ట్విట్టర్‌తో అధికారం దక్కదు

26 Sep, 2017 09:35 IST|Sakshi

సాక్షి, చెన్నై : నూతన రాజకీయ పార్టీతో త్వరలో తమిళ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు సీనియర్‌ నటుడు కమల్‌ హాసన్‌ రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో గత కొన్ని నెలలుగా ఆయన ప్రభుత్వంపై ట్విట్టర్‌లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా డెంగ్యూ నివారణలో ఘోరంగా విఫలమైందంటూ విమర్శలు చేయగా, ప్రభుత్వం నుంచి గట్టి కౌంటరే కమల్‌కు పడింది. 

కేవలం అధికారం కోసమే కమల్‌ తహ తహలాడుతూ కలలు కంటున్నాడని రాష్ట్ర మంత్రి డీ జయకుమార్‌ పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కమల్‌ వైఖరిని ఎండగట్టారు. ‘రాజకీయాలంటే 100 రోజులు ఆడే సినిమా అని ఆయన (కమల్‌) అనుకుంటున్నాడేమో. ముఖ్యమంత్రి పదవి అంటే మార్కెట్‌లో దొరికే బొమ్మ కాదు. ప్రజలు గుర్తించి, వాళ్లు అంగీకరిస్తేనే అధికారం, పదవులు దక్కుతాయి. ట్విట్టర్‌లో ట్వీట్లు చేస్తే కాదు’ అని జయకుమార్‌ అన్నారు. 

గతంలో ఇలాగే అభిమానులు ఉన్నారు కదా అన్న భరోసాతో నటుడు శివాజీ గణేశన్‌ రాజకీయాల్లోకి వచ్చి ఘోరంగా దెబ్బతిన్నారని, తొందరపడితే కమల్‌కి కూడా అదే గతి పడుతుందని జయకుమార్‌ చెప్పారు. నటులు మీటింగ్‌లు పెడితే అభిమానులు లక్షల్లో వస్తారేమో. కానీ, అంతా ఓట్లు వేస్తారన్న గ్యారెంటీ లేదు. రాజకీయాల్లో రాణించాలంటే ప్రజల్లోకి వెళ్లాలిగానీ, సోషల్‌ మీడియాలో కామెంట్లు చేయటం కాదు. ముందు కమల్‌ను పిట్ట కూతలు ఆపి, రాజకీయ పార్టీని స్థాపించమనండి అని జయకుమార్‌ చురకలంటించారు.  

శివాజీ ఫెయిల్యూర్‌ స్టోరీ...

ఎంజీఆర్‌ సమకాలీకుడు అయిన శివాజీ గణేశన్‌ 1955 లో డీఎంకేకు మద్ధతుదారుడిగా ఉండేవారు. తర్వాత కొంతకాలానికి కామ్‌రాజ్‌ విజ్ఞప్తి మేరకు తర్వాత కాంగ్రెస్‌లో చేరిపోయారు. తర్వాత కాంగ్రెస్‌ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఎంపికయ్యారు. ఇందిరాగాంధీ అనంతరం ఆయన రాజకీయాలకు దూరంకాగా, తిరిగి 1987లో తమిజగ మున్నేట్ర మున్నాని పేరిట కొత్త పార్టీని స్థాపించి రీఎంట్రీ ఇచ్చారు. రెండేళ్లకే పార్టీని జనతాదళ్‌ పార్టీలో విలీనం చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన నియమితులయ్యారు. హీరోగా అశేష అభిమానం సంపాదించుకున్న ఆయన నేతగా మాత్రం ఘోరంగా విఫలమయ్యారు.

మరిన్ని వార్తలు