కన్నా.. ఈ ఐదు ప్రమాణాలకు సిద్ధమా?

22 Apr, 2020 04:09 IST|Sakshi

2018లో మీకు గుండెపోటు వచ్చింది నిజమా.. కాదా?

ఎన్నికల నిధులు కొట్టేశారా.. లేదా?

అంబటి రాంబాబు సవాలు

చంద్రబాబు సూక్తి ముక్తావళిని వల్లిస్తున్నారు

సాక్షి, అమరావతి: బీజేపీలో ఆఫర్‌ కోసం గుండెపోటును తెప్పించుకుని గుంటూరు లలితా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా నీతులు వల్లెవేయడం ఏమిటని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీలోకి రావాలని ‘కన్నా’ ముహూర్తం పెట్టుకుని ఆ తరువాత బీజేపీ నుంచి ఆఫర్‌ వస్తే గుండెపోటు అని చెప్పి ఆసుపత్రిలో చేరిన మాట వాస్తవమా? కాదా?.. అని అంబటి ప్రశ్నించారు. రాంబాబు ఇంకా ఏమన్నారంటే.. 

► కాణిపాకం వినాయకుడి దగ్గరకు ‘కన్నా’ వచ్చి.. 2018 ఏప్రిల్‌ 24న తాను గుండెపోటుతోనే ఆసుపత్రిలో చేరాను, కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్యమంత్రి అవడానికి తాను రూ.20 కోట్లు ఢిల్లీలో ఒక బ్రోకర్‌కు ఇవ్వలేదు, 2019 ఎన్నికల్లో బీజేపీ అధ్యక్షుడిగా నాకు ఇచ్చిన నిధులను సద్వినియోగం చేశాను, చిన్నస్థాయిలో ఉన్న నేను ఇన్ని వందల కోట్లకు అధిపతి కావడానికి సొంతంగా కష్టపడి సంపాదించానే తప్ప రాజకీయ అవినీతి చేయలేదు, చంద్రబాబుకు అమ్ముడు పోలేదు.. అని ఈ ఐదు ప్రమాణాలను చేయాలి. 
► ‘కన్నా’ ఎప్పుడు విలేకరుల సమావేశం పెట్టినా ఈ ఐదింటికీ సమాధానం ముందుగా చెప్పాలి. 
► మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ రూ.20 కోట్లకు చంద్రబాబుకు అమ్ముడుపోయారని, ఆధారాలున్నాయని విజయసాయిరెడ్డి వివరంగా చెబితే మీరు ఆయనపై విరుచుకుపడ్డారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. 
► మీరు బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికల్లో పార్టీ నిధులను కొట్టేశారా లేదా లెక్క చెప్పకుండా తప్పుకు తిరుగుతున్నది నిజమా కాదా? 
► చంద్రబాబు రెండు రోజులకోసారి యాప్‌ ద్వారా వచ్చి కరోనా కేసులను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించి చూపిస్తోందని సూక్తిముక్తావళి చెబుతున్నారు. అసలు తగ్గించి చూపాల్సిన అవసరం ఏముంది? 
► బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్టులు ‘కన్నా’, సుజనాచౌదరి గురించి బీజేపీ నేతలు దయచేసి తెలుసుకోవాలి. 

మరిన్ని వార్తలు