బీజేపీ లేకుంటే నేను జీరో

31 Mar, 2019 04:48 IST|Sakshi
అహ్మదాబాద్‌లో నిర్వహించిన ర్యాలీలో అభివాదం చేస్తున్న అమిత్‌షా

పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా

అహ్మదాబాద్‌/గాంధీనగర్‌: తన రాజకీయ ప్రస్థానం 1982లో  బీజేపీ నుంచి ప్రారంభమైందని.. పార్టీలో కార్యకర్త   స్థాయి నుంచి అధ్యక్షుడి వరకు ఎదిగానని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. తన జీవితం నుంచి బీజేపీని తీసేస్తే మిగిలేది శూన్యమేనని వ్యాఖ్యానించారు. జీవితంలో తాను సాధించింది, నేర్చుకున్నది, దేశానికి ఇచ్చింది అంతా బీజేపీ ప్రసాదించిందేనని, బీజేపీ లేకుండా తాను జీరోనే అని అన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌ లోక్‌సభ స్థానానికి శనివారం ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. అంతకు ముందు జరిగిన రోడ్‌షో, ర్యాలీల్లో అమిత్‌షా పాల్గొన్నారు. అహ్మదాబాద్‌లోని నరేన్‌పుర వద్ద ఉన్న సర్దార్‌ పటేల్‌ విగ్రహం నుంచి ఈ రోడ్‌షో ప్రారంభమైంది. దాదాపు 4 కి.మీ. మేర సాగిన రోడ్‌షోకు జనం లక్షలాదిగా తరలివచ్చారు.  

మూడు రెట్లు పెరిగిన అమిత్‌షా ఆస్తులు
గత ఏడేళ్లలో తన ఆస్తులు మూడు రెట్లు పెరిగి రూ.38.81 కోట్లకు చేరినట్లు అమిత్‌ షా ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన, తన భార్య పేరిట రూ.23.45 కోట్ల మేర స్థిర, చర ఆస్తులున్నట్లు తెలిపారు. నామినేషన్‌ దాఖలు చేసిన సమయంలో తన చేతిలో రూ. 20,633 కోట్లు, భార్య వద్ద రూ.72,578 ఉన్నట్లు వెల్లడించారు. ఇద్దరు దంపతుల పేరిట బ్యాంకులో సేవింగ్స్‌ రూపంలో రూ.27.80 లక్షలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో రూ.9.80 లక్షలున్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు. రాజ్యసభ ఎంపీగా ఉండటంతో పాటు, అద్దెలు, వ్యవసాయం ద్వారా తనకు ఆదాయం వస్తున్నట్లు పేర్కొన్నారు.

బీజేపీ టోపీ వద్దు!
అమిత్‌ నామినేషన్‌ పత్రాలు వేయడానికి వెళ్లినపుడు సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి షా వెంట ఆయన కుటుంబ సభ్యులు కూడా వెళ్లారు. తన మనవరాలిని చేతిలోకి తీసుకున్న షా ఆమె ధరించిన టోపీని తీసేసి బీజేపీ టోపీ పెట్టగా ఆ చిన్నారి తనకు ఇష్టం లేదన్నట్లు వెంటనే తీసిపడేసింది. ఇలా మూడుసార్లు ప్రయత్నించి ఇక చేసేదేమీ లేక షా చివరకు ఆమె టోపీనే తిరిగి తొడిగి ముద్దాడారు.
 

మరిన్ని వార్తలు