సిద్ధూపై వ్యతిరేకత

14 Apr, 2018 08:00 IST|Sakshi

యడ్యూరప్పపై ప్రజాభిమానం

మోదీ, యడ్యూరప్పల నేతృత్వంలో కర్ణాటక సమగ్రాభివృద్ధి

ఎన్నికల ముందే బీజేపీకి గెలుపు సందేశం

ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా

సాక్షి, బళ్లారి: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రతి చోటా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై జనం తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారని, అదే సందర్భంలో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్పపై జనం ఎంతో అభిమానం కనబరుస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పేర్కొన్నారు. ఆయన శుక్రవారం కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బెళగావిలో కిత్తూరు రాణి చెన్నమ్మ విగ్రహం, సంగొళ్లి రాయణ్ణ సమాధులను దర్శించుకున్న అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలోను, విలేకరులతోను మాట్లాడారు. ఎందరో మహానుభావులు, స్వామీజీలకు జన్మనిచ్చిన కన్నడ నేలపై ప్రస్తుతం అవినీతి రాజ్యమేలుతోందని, దీంతో జనంలో సిద్ధరామయ్య సర్కార్‌పై తీవ్ర

అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయన్నారు. సిద్ధరామయ్య ఎన్నికల అనంతరం ఇంటికి పరిమితం అవుతారని జోస్యం చెప్పారు. యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి కావడం ఖాయమని, ఆయన నేతృత్వంలో కర్ణాటక సమగ్రాభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్రం లోను బీజేపీ అధికారంలో ఉండటంతో ప్రధాని మోదీ సహకారం కూడా యడ్యూరప్పకు ఎంతో లభిస్తుందని, ఇద్దరు నేతలు కర్ణాటకను దేశంలోనే నంబర్‌ వన్‌ చేస్తారనే విషయం జనం నమ్ముతున్నారని గుర్తు చేశారు. ఎన్నికలు జరగక ముందు గెలుపు సందేశం వ్యక్తం అవుతోందన్నారు. కర్ణాటక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని రాహుల్‌ గాంధీ సర్వశక్తులు ఒడ్డుతున్నారని, అయితే ఆయన ఆశలు ఫలించబోవన్నారు. కర్ణాటక ఎన్నికల అనంతరం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ ముక్త్‌ కాబోతుందన్నారు. కార్యక్రమంలో యడ్యూరప్ప, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు