నేడు రాష్ట్రానికి అమిత్‌షా

10 Oct, 2018 02:28 IST|Sakshi

     ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ రానున్న బీజేపీ అధినేత 

     పలు కార్యక్రమాల్లో పాల్గొని ఎన్నికల వ్యూహాలపై మార్గనిర్దేశం 

     అనంతరం కరీంనగర్‌ సమరభేరి బహిరంగ సభలో ప్రసంగం 

సాక్షి, హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌లో ఎన్నికల శంఖారావాన్ని పూరించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నేడు రాష్ట్రానికి రానున్నారు. ఇతర కార్యక్రమాలతో పాటు పార్టీ నేతలతోనూ భేటీ అయి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మార్గనిర్దేశం చేయనున్నారు. ఆయన పర్యటనతో పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెరుగుతుందని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. పార్టీకి బాగా పట్టున్న కరీంనగర్‌లో నిర్వహించే ఎన్నికల సమరభేరి సభలో షా పాల్గొననున్నారు. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో అమిత్‌షా పర్యటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన వ్యూహాలపై షా మార్గదర్శనం చేస్తారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేందుకు అనుసరించిన వ్యూహాలనే తెలంగాణలోనూ అమలు చేయాలని జాతీయ నాయకత్వం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 10న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌కు రానున్న అమిత్‌షా వివిధ కార్యక్రమాలతోపాటు పార్టీ ముఖ్యనేతలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జీలతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా రాష్ట్ర పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యాక మోదీ, అమిత్‌షా పాల్గొనే బహిరంగ సభల తేదీలను ఖరారు చేయనున్నారు.  

ఇదీ అమిత్‌షా షెడ్యూలు.. 
- ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 
అక్కడనుంచి బంజారాహిల్స్‌కు వెళతారు. అగ్రసేన్‌ మహరాజ్‌ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు.  
అనంతరం కాచిగూడలోని శ్యామ్‌బాబా ఆలయాన్ని సందర్శించి సాధువులతో సమావేశమవుతారు. 
12 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గాలకు చెందిన బూత్‌ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు ఆపైస్థాయి నాయకులతో నిర్వహించే ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొంటారు. 
అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు. 
భోజనం తర్వాత బేగంపేట్‌ ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో 3 గంటలకు కరీంనగర్‌ అంబేడ్కర్‌ స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ జరిగే ఎన్నికల సమరభేరి బహిరంగ సభలో పాల్గొంటారు. 
అనంతరం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో 119 నియోజకవర్గాలకు చెందిన అసెంబ్లీ కన్వీనర్లు, సమన్వయకర్తలతో ప్రత్యేక భేటీలో పాల్గొంటారు. 
ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మార్గదర్శనం చేస్తారు. అనంతరం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి వెళతారు.  

మరిన్ని వార్తలు