దళపతి దిశానిర్దేశం | Sakshi
Sakshi News home page

దళపతి దిశానిర్దేశం

Published Wed, Oct 10 2018 2:26 AM

Kcr about campaign strategy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముందస్తు ఎన్నికల ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన, ప్రచారంతో ప్రత్యర్థి పార్టీల కంటే గులాబీ పార్టీ ముందుకు దూసుకుపోతోంది. ప్రతిపక్షాల వ్యూహం ఎలా ఉం టుంది? దాన్ని ఎదుర్కొనడం ఎలా? అనే విషయంలో టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలకు మార్గదర్శనం చేయాలని అధినేత భావిస్తున్నారు. త్వరలోనే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు, రాష్ట్ర కమిటీ బాధ్యులతో సమావేశం నిర్వహించే యోచనలో కేసీ ఆర్‌ ఉన్నారు.

తెలంగాణ సాధన, టీఆర్‌ఎస్‌ ప్రభు త్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, రాష్ట్రం అభివృద్ధి వంటి అంశాలపై మార్గ నిర్దేశం చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా, జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా టీఆర్‌ఎస్‌ అనుసరించే వ్యూహాన్ని పార్టీ నేతలకు వివరించనున్నారని తెలిసింది. ప్రతి దసరా రోజుల్లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం ఎన్నికల సీజన్‌ కావడంతో మరింత మెరుగైన ప్రచార వ్యూహం అమలు చేసేలా గులాబీ సేనకు సూచనలు చేయనున్నట్లు తెలిసింది. పెండింగ్‌లో ఉన్న 14 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను ప్రకటించిన తర్వా త ఈ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.  

చేసింది చెప్పాలి..
టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రచార సరళి, ప్రజల్లో వస్తున్న స్పందనను కేసీఆర్‌ ప్రతిరోజు సమీక్షిస్తున్నారు. నివే దికల ఆధారంగా పలువురు ముఖ్యనేతలతో స్వయం గా మాట్లాడుతూ ఫోన్‌లో సూచనలు చేస్తున్నారు. చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని వివరిస్తూ స్థానికులతో మమేకం కావాలని అభ్యర్థులకు సూచిస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ కలసి పోటీ చేసే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, రాష్ట్ర ప్రయోజనాల కు కలిగే అడ్డంకులను వివరించాలని చెబుతున్నారు.

పెండింగ్‌ జాబితా సిద్ధం...
టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించాల్సిన 14 అసెంబ్లీ స్థానాల విషయంలోనూ కేసీఆర్‌ తుది నిర్ణయానికి వచ్చారు. అమావాస్య ముగియడంతో ఏ క్షణమైనా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. బుధవారం ఈ జాబితాను వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. జాబితా ప్రకటన ఆలస్యమైనా ప్రచారంలో ఇబ్బందులు రాకుండా ఈ స్థానాల్లో టికెట్‌ ఇచ్చే వారి కి ఇప్పటికే అనధికారంగా సమాచారం అందించారు.

మంత్రి కేటీఆర్‌తో ఒవైసీ భేటీ..
ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ మంగళవారం మంత్రి కేటీ రామారావును కలిశారు. భోలక్‌పూర్‌లోని సమస్యలు పరిష్కరించాలని ఆ ప్రాంత వ్యాపారులు పలువురితో కలసి ఓవైసీ.. కేటీఆర్‌ వద్దకు వచ్చారు. వెంటనే పరిష్కరిస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. ఉప్పల్, దేవరకొండ నియోజకవర్గాలకు చెందిన పలువురు ఇతర పార్టీల నేతలు కేటీఆర్‌ సమక్షంలో బుధవారం టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. తెలంగాణ భవన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు, అసమ్మతి నేతలతో కేటీఆర్‌ సమావేశాలు బుధవారం నుంచి కొనసాగనున్నాయి.


విశ్వసనీయ సమాచారం ప్రకారం జాబితాలో పేర్లు
ఖైరతాబాద్‌: దానం నాగేందర్, గోషామహల్‌: ప్రేంసింగ్‌ రాథోడ్, ముషీరాబాద్‌: ముఠా గోపాల్, అంబర్‌పేట: కాలేరు వెంకటేశ్‌/ఎడ్ల సుధాకర్‌రెడ్డి, మల్కాజ్‌గిరి: మైనంపల్లి హన్మంతరావు, మేడ్చల్‌: సీహెచ్‌ మల్లారెడ్డి, వికారాబాద్‌: బి.మధురవేణి/ ఆనంద్‌/ విజయ్‌కుమార్, జహీరాబాద్‌: ఎర్రోళ్ల శ్రీనివాస్, వరంగల్‌ తూర్పు: నన్నపునేని నరేందర్, చొప్పదండి: సుంకె రవిశంకర్, హుజూర్‌నగర్‌: సైదిరెడ్డి/ అప్పిరెడ్డి, కోదాడ: వి.చందర్‌రావు/ కె.శశిధర్‌రెడ్డి, మలక్‌పేట: చవ్వా సతీశ్, చార్మినార్‌: దీపాంకర్‌పాల్‌/ ఇలియాస్‌ ఖురేషి.

Advertisement
Advertisement