పొత్తులపై పూర్తి నిర్ణయం ఆయనదే!

7 Sep, 2018 13:04 IST|Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టకోబోతోందన్న ఊహాగానాలు తారాస్థాయికి చేరాయి. అయితే కాంగ్రెస్‌తో పొత్తు ఒక్క తెలంగాణలోనేనా లేక ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొనసాగించాలా అని ఆ పార్టీ తర్జనభర్జన పడుతోందని తెలుస్తోంది. పొత్తులపై ఇప్పటికే మంత్రులు, పార్టీ సీనియర్‌ నాయకుల సలహాలు సీఎం చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నారు. తారాస్థాయిలో జరగుతున్న పొత్తుల అంశంపై ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ మీడియా చిట్‌చాట్‌లో స్పందించారు. పొత్తుల అంశంపై గురువారం రాత్రి 11 గంటల వరకు మంత్రుల సమావేశం జరిగిందని.. నేతలందరికీ సీఎం ఒక డైరెక్షన్‌ ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో పూర్తి నిర్ణయాధికారం అధ్యక్షుడికే వదిలేశామని పితాని స్పష్టం చేశారు.

వ్యతిరేకత పెరుగుతుండటంతోనే ‘ముందస్తు’కు: యనమల
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండటంతోనే కేసీఆర్‌ ముందస్తుకు వెళ్లినట్లు అనిపిస్తోందని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. శుక్రవారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు ఒకేసారి జరిగితే ముస్లిం ఓట్లు కాంగ్రెస్‌కు పడతాయనే ఆందోళన కూడా ఒక కారణం కావచ్చన్నారు. కేంద్రం తెలంగాణపై సానకూలంగా ఉంటుందని.. కానీ ఏపీపై కపట ప్రేమ ప్రదర్శించిందని విమర్శించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి విధాన నిర్ణయాలు తీసుకోవడం కుదరదని, మధ్యంతర భృతి ప్రకటన చేసినా.. అమలు చేసే పరిస్థితి ఎంత వరకు ఉంటుందో అని అనుమానం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు