కారెక్కిన కాంగ్రెస్‌ నేత సురేశ్‌ రెడ్డి

7 Sep, 2018 13:09 IST|Sakshi
సురేశ్‌ రెడ్డి, కేటీఆర్‌

ఆపరేషన్‌ ఆకర్ష్‌తో దూకుడు పెంచిన టీఆర్‌ఎస్‌

సురేశ్‌ రెడ్డి నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్‌

రెండు రోజుల్లో పార్టీలో చేరనున్న సురేశ్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : మాజీ స్పీకర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సురేశ్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన మంత్రి కేటీఆర్‌, సురేశ్‌రెడ్డితో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. 1989 నుంచి అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌, సురేశ్‌ రెడ్డిలు మంచి స్నేహితులని, ఇరువురు కలిసి శాసన సభలో పనిచేశారని, పరస్పర అభిప్రాయాలు పంచుకున్నారని గుర్తు చేశారు.  ముఖ్యంగా తెలంగాణ కోసం ఇద్దరికి ఒక భావసారుప్యత ఉండేదన్నారు. పార్టీలు, ఆలోచనలు వేరైన ఇరువురు తెలంగాణ కోసం ఒకే భావనతో ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో తమ అధినేత కేసీఆర్‌ సూచనల మేరకు సురేశ్‌ రెడ్డిని పార్టీలో ఆహ్వానించేందుకు ఆయన నివాసానికి ప్రభుత్వ సలహాదారుడు మాజీ ఎంపీ వివేక్‌, తాజా మాజీ ఎమ్మెల్యేలు ప్రశాంత్‌ రెడ్డి, జీవన్‌ రెడ్డిలు వచ్చామన్నారు. మా ఆహ్వానాన్ని మన్నించి ఆయన టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారని, ఆయనకు తగిన పదవి ఇచ్చి గౌరవమిస్తామన్నారు.     

రాజకీయ లబ్ధికోసం రావడం లేదు: సురేశ్‌ రెడ్డి
రాజకీయ లబ్ధికోసం టీఆర్‌ఎస్‌లో చేరడం లేదని సురేశ్‌ రెడ్డి అన్నారు. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన కూడా అయిపోయిందని, సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు రాష్ట్రాభివృద్ధిలో భాగమయ్యేందుకు పార్టీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. ఆర్థికపరమైన పేపర్లలో వస్తున్న వార్తలు  రాష్ట్ర అభివృద్ధిపై స్పష్టమైన వివరాలిస్తున్నాయని, ఈ అభివృద్ధి ఇంతే వేగంగా కొనసాగిల్సిన అవసరం ఉందన్నారు. దీంతోనే పార్టీలో చేరి ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధానకర్తగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వేగంగా నడిపే కారులో డ్రైవర్‌ను మారిస్తే ఎలా ఇబ్బంది కలుగుతుందో.. ప్రస్తుత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి కూడా అలానే ఉందన్నారు. సీఎంగా కేసీఆర్‌ కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు.

మరిన్ని వార్తలు