మహారాష్ట్రలో ఎంఐఎం సంచలనం

24 Oct, 2019 13:32 IST|Sakshi

గణనీయంగా మైనారిటీ ఓట్ల చీలిక

లాభపడిన కాషాయ కూటమి..

ఔరంగబాద్‌లో సంచలనం దిశగా ఒవైసీ పార్టీ

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ సత్తా చాటింది. గణనీయమైన స్థానాలు గెలుపొందనప్పటికీ.. మైనారిటీ ఓట్లను చీల్చడం ద్వారా పలు పార్టీల గెలుపోటములు శాసించగలిగింది. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీకి మజ్లిస్‌ పార్టీ గట్టి షాక్‌ ఇచ్చింది. దాదాపు 44 స్థానాల్లో మజ్లిస్‌ పార్టీ అభ్యర్థులకు గణనీయమైన సంఖ్యలో ఓట్లు వచ్చాయి. ఒకప్పుడు మైనారిటీ ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్‌ పార్టీకే పడేవి. అటు హిందుత్వ కూటమిగా బీజేపీ-శివసేన కలిసి పోటీచేస్తున్న నేపథ్యంలో మైనారిటీలు సహజంగానే కాంగ్రెస్‌ పార్టీ వైపు మొగ్గుచూపేవారు. అయితే, ఈసారి మస్లిజ్‌ పార్టీ పెద్ద ఎత్తున స్థానాల్లో పోటీచేసి.. గట్టిగా ప్రచారం చేయడంతో కాంగ్రెస్‌కు మైనస్‌గా మారింది. కాంగ్రెస్‌కు ఓటుబ్యాంకుగా ఉన్న మైనారిటీ ఓట్లు చీలడం.. బీజేపీ-శివసేన కూటమికి వరంగా మారింది. దీంతో కాంగ్రెస్‌కు పట్టున్న కొన్ని స్థానాల్లోనూ బీజేపీ కూటమి సునాయసంగా గెలువగలిగింది.

మహారాష్ట్రలోని మైనారిటీ ఓట్లను ఏకతాటిపైకి తేవడంలో ఆ పార్టీ విఫలమైన పరిస్థితి కనిపిస్తోంది. మైనారిటీ పార్టీగా పేరొందిన ఎంఐఎం పోటీ..  చాలాస్థానాల్లో కాంగ్రెస్‌ విజయ అవకాశాలకు గండికొట్టింది. మైనారిటీ ఓటర్లు మజ్లిస్‌ వైపు మొగ్గడం కాంగ్రెస్‌ను దెబ్బతీసింది. దీంతో ఆ పార్టీ ప్రతిపక్ష కాంగ్రెస్‌-ఎన్సీపీ కూటమిలో రెండోస్థానానికి పడిపోయింది. గతంలో గెలుచుకున్న స్థానాలను కూడా నిలబెట్టుకోలేకపోయింది. ఒకవైపు బీజేపీ-శివసేన కూటమి మరోసారి కంఫర్టబుట్‌ మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకోగా.. మరోవైపు మరాఠా కురువృద్ధుడు శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ 50కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ.. పర్వాలేదనిపించగా.. కాంగ్రెస్‌ మాత్రం 37 స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఔరంగాబాద్‌లో సంచలనం
ఔరంగాబాద్‌ నియోజకవర్గంలో సంచలన విజయం దిశగా ఎంఐఎం సాగుతోంది. ఈ నియోజకవర్గంలో పోలైన ఓట్లలో 80శాతానికిపైగా ఓట్లు ఎంఐఎం అభ్యర్థికి దక్కడం గమనార్హం. ఎన్నికల చరిత్రలోనే ఒక అభ్యర్థికి ఈస్థాయి ఓట్లు రావడం అనేది ఇదే తొలిసారి అంటున్నారు. ఈ నేపథ్యంలో ఔరంగాబాద్‌ నియోజకవర్గంలో రికార్డుస్థాయి మెజారిటీతో సంచలన విజయం దిశగా ఎంఐఎం సాగుతోంది. మరో నియోజకవర్గంలోనూ ఎంఐఎం బొటాబొటి మెజారిటీతో ఆధిక్యంలో కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు