‘ఆ చట్టంలో ఆర్టీసీ ప్రైవేటీకరణ లేదు’

2 Nov, 2019 17:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరీంనగర్‌లో నిన్న బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ పట్ల పోలీసుల తీరును ఖండిస్తున్నామని బీజేపీ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడు ఇంద్రసేనారెడ్డి అన్నారు. తెలంగాణ వస్తే స్వేచ్ఛ ఉంటుందని భావించామని, కేసీఆర్ స్వేచ్ఛను హరించారని విమర్శించారు. సమగ్ర సర్వేతో అందరి వ్యక్తిగత వివరాలు సేకరించి, రాజకీయ ప్రత్యర్ధుల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కాకుండా వ్యాపారం కోసం కూడా పౌరుల వ్యక్తిగత సమాచారం వాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

నష్టం వచ్చినా భరించాలే..
పేద ప్రజలందరికీ ప్రభుత్వం వాహనాలు ఏర్పాటు చేయలేదు కాబట్టి, కేంద్రం ఆర్టీసీని ఏర్పాటు చేసిందని ఇంద్రసేనారెడ్డి గుర్తు చేశారు. తర్వాతి కాలంలో రాష్ట్రాలు ఆర్టీసీని ఏర్పాటు చేసుకున్నాయని వెల్లడించారు. ఆర్టీసీలో కేంద్రం 31శాతం పెట్టబడి పెట్టినా.. ఎక్కడా అజమాయిషీ చేయలేదని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టం వచ్చినా, లాభం వచ్చినా మెజారిటీ షేర్ ఉన్న వాల్లే భరిస్తారని, ఇది కూడా ముఖ్యమంత్రికి తెలియదనుకోవడం సరైంది కాదని అన్నారు.

ఆ హక్కు ప్రభుత్వానికి లేదు..
ఆర్టీసీ ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ మోటార్ వెహికల్ చట్టంలో ఎక్కడ చెప్పలేదని ఇంద్రసేనారెడ్డి అన్నారు. 1950 కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం ఆర్టీసీ ఆస్తులను అమ్మే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. మెట్రోలో వచ్చే నష్టాన్ని సర్దుబాటు చేసుకోడానికి కొన్ని కమర్షియల్ స్థలాల్ని మెట్రో కు ఇచ్చారని, ఆర్టీసీకి కూడా అదేవిధంగా ఇవ్వాలని కదా అని ప్రశ్నించారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా ఆర్టీసీ లు నష్టాలలో ఉన్నాయని, అయినప్పటికీ పేదవాడి సంక్షేమం కోసం నడుస్తున్నాయని వెల్లడించారు. గతంలో అనేక కార్పోరేషన్లను ప్రభుత్వంలో కలిపారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు