బాలకృష్ణను వదిలి.. మాపై కేసులా?

1 May, 2018 12:55 IST|Sakshi
ఉపవాస దీక్షలో పాల్గొని మాట్లాడుతున్న జిల్లా ఇన్‌చార్జి పూడి తిరుపతిరావు

అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ బీజేపీ నాయకుల ఉపవాస దీక్ష

కాకినాడ రూరల్‌: బీజేపీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య సోమవారం కలెక్టరేట్‌ కార్యాలయం వద్ద ఉపవాస దీక్ష చేపట్టారు. ఈయనకు మద్దతుగా పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు పాల్గొని దీక్షల్లో కూర్చున్నారు. బాలకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేసిన బీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం చూస్తే ప్రభుత్వం పరిస్థితి ఏమిటో ప్రజలకు ఇట్టే అర్ధమవుతోందని బీజేపీ నాయకులు విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని నోటికొచ్చినట్టు దుర్భాషలాడిన బాలకృష్ణ దిష్టిబొమ్మ దహనం చేస్తే చంద్రబాబు పోలీసులతో బీజేపీ నాయకులపై కేసులు పెట్టించారన్నారు.

బీజేపీ నాయకులు తమ నాయకుడైన ప్రధానమంత్రి మోదీని దుర్భాషలాడిన బాలకృష్ణపై కేసులు పెడితే ఎందుకు కేసులు తీసుకోలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నాయకులు మోదీ దిష్టిబొమ్మను తగలబెడితే ఏ ఒక్కరిపై కేసులు పెట్టని పోలీసులు చంద్రబాబుకు తొత్తులుగా మారి బీజేపీ నాయకులపై కేసులు పెడుతున్నారన్నారు. అతి తొందర్లోనే టీడీపీకి పాడికట్టే సమయం ఆసన్నమైందని నాయకులు అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్‌ మోర్చా అధ్యక్షులు, జిల్లా ఇన్‌చార్జి పూడి తిరుపతిరావు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, పైడా కృష్ణమోహన్, రంబాల వెంకటేశ్వరరావు, వేటుకూరి సూర్యనారాయణరాజు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలోజిల్లా బీజేపీ నాయకులు ఘంటసాల గోవిందు, ప్రధాన కార్యదర్శి నల్లా పవన్, గుర్రాల వెంకటరావు, ఆకుల వీరబాబు, చిట్రీడి శ్రీనివాసు, కార్పొరేటర్లు లక్ష్మీప్రసన్న, సుజాత, పార్టీ నాయకులు మామిడాల శ్రీనివాస్, అప్పాజీ, సాయి, సుబ్బారావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు