ప్రియాంకపై సుబ్రమణ్యస్వామి అభ్యంతరకర వ్యాఖ్యలు

27 Jan, 2019 14:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై బీజేపీకి చెందిన మరో సీనియర్‌ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక ‘బైపోలార్‌ డిజార్డర్‌’ అనే మానసిక రుగ్మతతో బాధపడుతోందని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యానించారు. ఈ వ్యాధి ప్రజలకు కూడా వ్యాపించేలా కాంగ్రెస్‌ యత్నిస్తోందని, బైపోలార్‌ డిజార్డర్‌తో ప్రియాంక ప్రజా జీవితంలో పనిచేయలేదని  ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ప్రియాంకకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు తూర్పు యూపీ ప్రచార ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తూ గత బుధవారం కాంగ్రెస్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఇక ప్రియాంక పొలిటికల్‌ ఎంట్రీపై ఇటీవల మరికొందరు బీజేపీ నేతలు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక అందమైన ముఖం చూసి జనం ఓట్లు వేయరని బిహార్‌ మంత్రి వినోద్‌ నారాయణ్‌ ఝా వ్యాఖ్యానించగా..  అవినీతి, కళంకిత మనిషి రాబర్ట్ వాద్రా భార్య కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు చేపట్టడం బీజీపీకి లాభిస్తుందని  బిహార్‌ ఉపముఖ్యమంత్రి సుశీల్‌ మోదీ వ్యాఖ్యానించారు. ఇక బీజేపీ మరో నేత కైలాష్‌ విజయ్‌వర్జియా..  ‘కాంగ్రెస్‌లో సమర్థవంతమైన నాయకులు లేరు. అందుకనే ప్రియాంకకు పదవులు కట్టబెట్టారు. చాకొలేట్‌ ఫేస్‌లతో వచ్చే లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొందామని  కాంగ్రెస్‌ నేతలు కలలుగంటున్నారు’ అని ఎద్దేవా చేశారు.

బైపోలార్‌ డిజార్డర్‌ ఉన్నవారిలో మానసిక ఉద్వేగాలు అతి ఎక్కువగా ఉంటాయి. సంతోషంగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా ఎగ్జయిట్‌మెంట్‌కి లోనుకావడం, బాధగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా కుంగిపోవడం జరుగుతుంది. వీరిలో కనిపించే ఈ మానసిక స్థితిని బైపోలార్‌ డిజార్డర్‌గా పిలుస్తారు. 

మరిన్ని వార్తలు