కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్, టీడీపీలు కవలలు

7 Jun, 2018 03:51 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న లక్ష్మణ్‌

రైతుబంధు పథకంతో పెత్తందారులు, బినామీలకే లాభం

బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో లక్ష్మణ్‌

సదాశివపేట(సంగారెడ్డి): కాంగ్రెస్‌కు కవల పిల్లలుగా టీఆర్‌ఎస్, టీడీపీలు పనిచేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో జరిగిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కర్ణాటకలో టీఆర్‌ఎస్, టీడీపీల పరోక్ష మద్దతుతోనే సీఎం పదవి చేపట్టినట్లు కుమారస్వామి వెల్లడించారని చెప్పారు. టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేస్తే కాంగ్రెస్‌ను సమర్థించినట్లేనని, కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే టీఆర్‌ఎస్‌ను సమర్థించినట్లేనని చెప్పారు. కాంగ్రెస్‌ చేస్తున్న బస్సు యాత్రలతో టీఆర్‌ఎస్‌కే లాభం చేకూరుతుందన్నారు.

సంగారెడ్డి జిల్లాకు కేంద్రం ఇప్పటి వరకు రూ.375.52 కోట్ల నిధులు కేటాయించిందని చెప్పారు. ప్రతీ గ్రామపంచాయతీకి 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.30 లక్షల వరకు కేంద్రం మంజూరు చేసిందన్నారు. రైతుబంధు పథకం మోతుబరి రైతులు, బినామీలకే ఎక్కువ ఉపయోపడుతుందన్నారు. రైతుబంధు పథకం కౌలు రైతులకు ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు. రైతుబంధు పథకం ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకే ఉపయోగపడుతుందని, ప్రజాధనంతో ఓట్లు కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో కేంద్రంలో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో రాష్ట్రంలో పల్లెబాట, పల్లెనిద్ర కార్యక్రమాలు నిర్వహించి టీఆర్‌ఎస్, టీడీపీ, కాంగ్రెస్‌ల గురించి ప్రజలకు వివరిస్తామని చెప్పారు.

ప్రాజెక్టుల పూర్తికి కేంద్రం కృషి
సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరానికి టీఏసీ అనుమతులు లభించడంపై లక్ష్మణ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ అనుమతుల మంజూరీలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణానికి వెంట వెంటనే అనుమతులిస్తూ త్వరితగతిన పూర్తి చేయడానికి కేంద్రం విశేషంగా కృషి చేస్తోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు