నీచ రాజకీయాలు ఎన్నటికీ చేయను

11 Aug, 2018 14:10 IST|Sakshi
గుంటూరులో మాట్లాడుతున్న బొల్లా బ్రహ్మనాయుడు, పక్కన నాయకులు

వైఎస్సార్‌ సీపీ వినుకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి బొల్లా బ్రహ్మనాయుడు

కొత్తపాలెం యువకుల మృతిపై ఎమ్మెల్యే జీవీ ఆరోపణలకు ఖండన

నికిని కాపాడుకోవడం కోసమే జీవీ ఆరోపణలు

వాస్తవాలు నిలకడగా బయటకు వస్తాయని వెల్లడి

గుంటూరు, వినుకొండ టౌన్‌: నీచ రాజకీయాలను ఎన్నటికీ చేయనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వినుకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి బొల్లా బ్రహ్మనాయుడు స్పష్టం చేశారు. వినుకొండ మండలంలోని ఎ.కొత్తపాలెం గ్రామానికి చెందిన చల్లా వెంకటకృష్ణ, గురజాల సోమయ్య, మేడబోయన మల్లిఖార్జున్‌ ముగ్గురు యువకులు వినుకొండకు సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. గ్రామంలో వివాదాల కారణంగా కారుతో ఢీకొట్టి ప్రమాదం సృష్టించారని ఆరోపణలు ఉత్పన్నమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి బొల్లానే ముగ్గురి మృతికి కారణమంటూ ఆరోపణలు చేశారు. దీనికి స్పందించిన బొల్లా స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.  హత్యా రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదని, కార్యకర్తలను రెచ్చగొడుతూ వారి మధ్య వివాదాలను సృషించి రాజకీయ లబ్ధిపొందాలని శాసనసభ్యుడు జీవీ ఆంజనేయులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హత్యా రాజకీయాలు చేయడం, ప్రోత్సహించడం తనకు తెలియని విషయాలని చెప్పారు. హత్యలు ఎవరు చేస్తారో? చేయిస్తారో? ప్రజలకు తెలుసన్నారు. గతంలో పోటీ చేసేందుకు అర్హత కోల్పోయిన జీవీ హత్యల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.

ముగ్గురిని బలిగొన్నాక కన్వీనర్‌ సస్పెండా?
2004లో జీవీకి పార్టీ అధిష్టానం అసెంబ్లీకి పోటీ చేసేందుకు సీటు ఎందుకు కేటాయించలేదో? నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునని బొల్లా గుర్తుకు చేశారు. 62 ఏళ్లలో వ్యాపారం చేసినా, రాజకీయం చేసినా నిజాయితీగా చేయడం బ్రహ్మనాయుడుకు మొదటి నుంచి వచ్చిన అలవాటని చెప్పారు. ఎమ్మెల్యే కొత్తపాలెం గ్రామం పార్టీలో వర్గాలను తయారు చేసి వివాదాలకు కారణం కాలేదా అని ప్రశ్నించారు. అందులో భాగంగా టీడీపీ గ్రామ పార్టీ నాయకుడికి వారి పార్టీలో వారికే విభేదాలు వచ్చాయన్నది ఎమ్మెల్యేకు తెలియదా అన్నారు. దీనిని పరిష్కరించకుండా వివాదాన్ని పెంచి పోషిస్తున్నది ఎమ్మెల్యే కాదా అని సూటిగా ప్రశ్నించారు. ఆ వివాదాలను పరిష్కరించుకోవడం కోసం కొందరు మోటారు సైకిల్‌పై, మరికొందరు కారులో వస్తుండగా జరిగిన ఘోరం కాదా ఇది అని నిలదీశారు. ఎమ్మెల్యే పెట్టిన రాజకీయ చిచ్చులో అమాయకంగా ముగ్గురు ముక్కుపచ్చలారని యువకులు బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి నీచ సంస్కృతి, రాజకీయాలను ఎన్నటికీ చేయనని బొల్లా చెప్పారు. నియోజకవర్గంలో తన ఉనికిని కోల్పోతున్న ఎమ్మెల్యే ప్రతి విషయాన్నీ రాజకీయం చేయడం అలవాటు చేసుకున్నారని విమర్శించారు. ప్రజల్లో ఉనికిని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే జీవీ నోటికి వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నిజానిజాలు ప్రజలు తెలుసుకుంటున్నారని చెప్పారు. ముగ్గురి ప్రాణాలు పోయిన తర్వాత పార్టీ గ్రామ కన్వీనర్‌ను సస్పెండ్‌ చేశామని చెప్పడం సిగ్గుగా లేదా? అని ప్రశ్నించారు. ముందు నుంచి వారి మధ్య వస్తున్న వివాదాలను పరిష్కరించి ఉంటే ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కాదు అన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు