‘ఆళ్లగడ్డ పంచాయితీ’ నేటికి వాయిదా

27 Apr, 2018 03:10 IST|Sakshi

మంత్రి అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య తారాస్థాయికి విభేదాలు

ఇద్దరిపైనా ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం

సాక్షి, అమరావతి: పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి వర్గాల మధ్య కర్నూలు జిల్లాలో సయోధ్య కుదిర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో జరగాల్సిన సమావేశం శుక్రవారానికి వాయిదా పడింది. సైకిల్‌ యాత్ర చేస్తున్న సుబ్బారెడ్డిపై రాళ్లదాడి జరగడంతో టీడీపీలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడడంతో ఇద్దరినీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పంచాయితీకి పిలిచిన విషయం తెలిసిందే.

మంత్రి అఖిలప్రియ రెండు రోజులపాటు రకరకాల కారణాలతో సమావేశానికి గైర్హాజరయ్యారు. అఖిలప్రియ గురువారం రాత్రి తన సోదరి మౌనిక, ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డితో పాటు సీఎంను ఆయన నివాసంలో కలిశారు. ఏవీ సుబ్బారెడ్డి కూడా అదే సమయానికి వెళ్లటంతో మీ పద్ధతి బాగోలేదంటూ ఇద్దరిపైనా ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈరోజు సమయం లేనందున శుక్రవారం రావాలని వారిని చంద్రబాబు ఆదేశించారు. అదే సమయంలో చింతలపూడి నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు కూడా వచ్చారు. గొడవలు పడితే సహించేది లేదని ముఖ్యమంత్రి వారిని హెచ్చరిస్తూ శుక్రవారం తనను కలవాలని చెప్పి పంపించేశారు.

మరిన్ని వార్తలు