కాంగ్రెస్‌ లిస్టుకు ఎసరు

20 Apr, 2018 07:27 IST|Sakshi

మార్పులు చేర్పులు తప్పవా

అలకపాన్పులే కారణం

సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌ పార్టీ ఇటీవల 218 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ జాబితాలో మొత్తం 11 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు మొండిచేయి చూపారు. వారితో పాటు టికెట్‌ ఆశించి భంగపడ్డ సీనియర్‌ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు పలు ప్రాంతాల్లో ఆందోళనకు దిగారు. కొందరు సీఎంను, మరికొందరు ఢిల్లీలో పెద్దలను కలిసి గోడు వెళ్లబోసుకుంటున్నారు. రాష్ట్రంలో ఇంకా అసమ్మతి సెగలుచల్లారలేదు.

దీంతో కాంగ్రెస్‌ పెద్దలు జాబితాను సవరిస్తారని తెలుస్తోంది. తుమకూరు జిల్లా తిపటూరు, చిత్రదుర్గ జిల్లా జగలూరు, బాగల్‌కోట జిల్లా బాదామి నియోజకవర్గాలకు తాజాగా అభ్యర్థులను మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ నిరసనలు తీవ్రతరం కావడమే కారణం. తిపటూరు నుంచి మాజీ ఎమ్మెల్యే బి.నంజామరి, జగలూరు నుంచి ఏఆర్‌ పుష్ప, బాదామి నుంచి దేవరాజ్‌పాటిల్‌ టికెట్‌ రేసులో ఉన్నారు.  ఈమేరకు వారు రెండు రోజుల క్రితం సీఎం సిద్ధరామయ్య, రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జి వేణుగోపాల్‌తో చర్చించారు. తొలి జాబితాలో పేర్లు లేని తిపటూరు, జగలూరు ఎమ్మెల్యేలు షడక్షరీ, రాజేష్‌ గురించి కూడా కాంగ్రెస్‌ పెద్దలు చర్చించినట్లు తెలిసింది.

అలకపాన్పుపై అంబి
బెంగళూరులో మల్లేశ్వరం అభ్యర్థి ఎంఆర్‌ సీతారాం పోటీకి నిరాసక్తంగా ఉన్నారు. సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్‌ పరమేశ్వర్, రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జి వేణుగోపాల్‌ను కలిసి మరెవరికైనా టికెట్‌ ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. మండ్యలో సినీ ప్రముఖుడు అంబరీష్‌ది మరో డిమాండ్‌. తనకు మండ్య జిల్లా బాధ్యతలతో పాటు తన మద్దతుదారులకు టికెట్‌ కేటాయించాలని అంబరీష్‌ పట్టుబడుతున్నారు. ఇంతవరకు నామినేషన్‌ వేసేందుకు సుముఖత చూపడం లేదు. అధిష్టానం తన షరతులు ఒప్పుకుంటే శుక్రవారం నామినేషన్‌ వేస్తారని ఆయన అనుచరులు తెలిపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ జాబితాలో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయనేది పార్టీ వర్గాల కథనం.

మరిన్ని వార్తలు