కేసీఆర్‌కు అఖిలేష్‌ యాదవ్‌ మద్దతు

2 May, 2018 18:17 IST|Sakshi

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అఖిలేష్‌ యాదవ్‌ చర్చలు

ఫెడరల్‌ ఫ్రంట్‌ 2019 ఎన్నికల కోసం కాదన్న కేసీఆర్‌

బీజేపీని వాళ్లు మాత్రమే అడ్డుకోగలరు

ప్రజలు కొత్త రాజకీయ పంథాను కోరుకుంటున్నారు

సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌

సాక్షి, హైదరాబాద్‌ : ఫెడరల్‌ ఫ్రంట్‌ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావు మరో అడుగు ముందుకేశారు. కొత్త ఫ్రంట్‌ ఏర్పాటుకై కేసీఆర్‌ గత కొంతకాలం నుంచి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇటీవల చెన్నై వెళ్లి తమిళనాడు రాజకీయ కురువృద్ధుడు కరుణానిధిని కలిసిన కేసీఆర్‌ నేడు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌తో హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో గుణాత్మక మార్పు తెచ్చేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. ఇది 2019 ఎన్నికల కోసం చేస్తున్న ప్రయత్నం కాదన్నారు. దేశ రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్‌.. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని యత్నిస్తున్నాం అన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు విషయంలో చాలాసార్లు అఖిలేష్‌ యాదవ్‌తో ఫోన్‌లో సంభాషించామని తెలిపారు. దీనిపై పలుసార్లు చర్చలు జరిపామని ఇందులో భాగంగానే అఖిలేష్‌ హైదరాబాద్‌ వచ్చారని చెప్పారు.

అనంతరం​ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. తాను చాలాసార్లు కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడానన్నారు. ఈసారి నేరుగా మాట్లాడాలనే ఉద్దేశంతోనే హైదరాబాద్‌ వచ్చినట్లు తెలిపారు. చాలా అంశాలపై చర్చించామని తెలిపారు. కేసీఆర్‌ ప్రభుత్వం చాలా మంచి పనులు చేస్తోందని కితాబిచ్చారు. రైతులు సహా అన్ని వర్గాల ప్రజల అభిమానం కేసీఆర్‌ సర్కార్‌కు ఉందన్నారు. దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా సాగునీరుకు ప్రాముఖ్యత ఉందని, అందులో కేసీఆర్‌ ప్రభుత్వం రైతులకు ఎంతో చేస్తోందని పేర్కొన్నారు. ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వాలు ప్రజలను తీవ్రంగా నిరాశ పరిచాయని... ఇప్పుడు ప్రజలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలు చేస్తున్నామని, ప్రాంతీయ పార్టీలు, నేతలు మాత్రమే బీజేపీని అడ్డుకోగలరని అఖిలేష్‌ వ్యాఖ్యానించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్‌ ప్రజలకు ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆయన విమర్శించారు. సమాజ్‌వాదీ పార్టీకి హైదరాబాద్‌తో చాలా గట్టి, పాత అనుబంధం ఉందని ఆయన గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో తాము బలమైన అనుబంధం కోరుకుంటున్నామని చెప్పారు. దేశ ప్రజలు ఒక కొత్త రాజకీయ పంథాను కోరుకుంటున్నారని, అందుకే కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నానికి తాము మద్దతు ఇస్తున్నామని అఖిలేష్‌ స్పష్టం చేశారు. మీడియా సమావేశానికి ముందు కేసీఆర్‌, అఖిలేష్‌ యాదవ్‌లు సుమారు నలభై నిమిషాల పాటు ఏకాంతంగా చర్చలు జరిపారు.

మరిన్ని వార్తలు