బొబ్బిలి రాజులపై తిరుగుబాటు

30 Mar, 2018 13:33 IST|Sakshi
ఏడుస్తూ దండం పెడుతున్న తూమురోతు వెంకట్‌

బొబ్బిలి టీడీపీలో బట్టబయలైన అసంతృప్తి సెగలు

కష్టపడినవారికి గుర్తింపు లేదంటూ గగ్గోలు

మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్న తెలుగు యువత నాయకుడు

చొక్కా చింపుకుని ఏడుస్తూ ‘తూముల’ కాళ్లపై పడిన వైనం

కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు

పట్టణంలో కలకలం రేపిన టీడీపీ తీరు

నివురుగప్పిన నిప్పులా ఉన్న బొబ్బిలి

టీడీపీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పార్టీని, కార్యకర్తలను కాదని వ్యక్తిపూజకే బొబ్బిలి రాజులు ప్రాధాన్యమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ పార్టీ తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు పెనుదుమారాన్నే లేపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ వేదికగా రాష్ట్ర మంత్రి సుజయకృష్ణ రంగారావు వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ బహిరంగంగా ఆయన కళ్లెదుటే విమర్శలు చేయడం... రాజులపై తిరుగుబాటు చేయడం జిల్లాలో సంచలనం రేపింది

సాక్షిప్రతినిధి, విజయనగరం/బొబ్బిలి: బొబ్బిలి కోట..తెలుగు దేశం పార్టీకి కంచుకోటగా మారుతుందని భావించి వైఎస్సార్‌సీపీ టిక్కెట్టుతో గెలిచిన ఆర్‌.వి.సుజయకృష్ణ రంగారావును టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీలో చేర్చుకున్నారు. కానీ ఇప్పుడు అదే బొబ్బిలిలో టీడీపీకి బీటలు వారుతున్నాయి. సుజయ్‌ ఆ పార్టీలోకి వెళ్లిన వెంటనే ఆయన సత్తా ఏమిటో టీడీపీ అధిష్టానానికి, కార్యకర్తలకు అర్థమయ్యింది. ఇక అప్పటి నుంచి ఆయన చేత పనిచేయించడానికి నానా తంటాలు పడుతున్నారు. మంత్రి పదవి ఇస్తే సీరియస్‌గాపట్టించుకుంటాడనుకుని రాష్ట్ర గనులశాఖ అప్పగించారు. అయినా సుజయ్‌లో మార్పు రాలేదు.

వివాదాలకు వేదికైన ఆవిర్భావ సభ
ఎన్నికల్లో గెలిపించిన పార్టీకే వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయిన ఆయనపై టీడీపీ నేతల్లో అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో.. పార్టీ కోసం కష్టపడుతున్న వారికి గుర్తింపు లేదని, కొంత మంది తొత్తులు చుట్టూ చేరి పబ్బం గడుపుకుంటుంటే మాకెందుకీ కష్టాలని టీడీపీ తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు తూమురోతు వెంకట్‌ బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ఆవిర్భావ దినోత్స వం సందర్భంగా గురువారం ఉదయం బొబ్బిలి కోటలో జరిగిన సమావేశంలో మంత్రి సుజయకృష్ణ రంగారావు ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా ఆయన అడ్డుపడ్డారు. ‘మా పరిస్థితి ఇంతేనా’ అంటూ పెద్దగా కేకలేస్తూ నెత్తీనోరూ బాదుకుంటూ తమకు అన్యాయం చేస్తున్నారని వాపోయారు. నాయకులు, కార్యకర్తల సమక్షంలో వెంకట్‌ ఇలా ప్రవర్తించేసరికి అవాక్కయిన మంత్రికి నోటమాటరాలేదు. మంత్రి అనుచరులు వెంకట్‌ను అడ్డుకోవాలని ప్రయత్నించడంతో కాసేపు తోపులాట జరిగింది. పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం అందడం లేదని, అసలు కార్యక్రమాలే చేయడం లేదని, తమ వంటి కార్యకర్తలకు ఏం గుర్తింపు ఉందని వెంకట్‌ నిలదీశా రు. రాష్ట్ర ఆర్ధిక మండలి సభ్యుడు తూముల భాస్కరరావు, ఇతర నాయకులు కల్పించుకుని ఆయన్ను సభ నుంచి బయటకు తీసుకెళ్లారు. అక్కడ ఆయనను అనునయించాలని ప్రయత్నించి నా కుదరలేదు. చాలాసేపు టీడీపీ కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాన్ని వెంకట్‌ వెళ్లగక్కారు. తనతో పాటు చాలా మంది ఇదే ఆవేదనలో ఉన్నారన్నారు.

గైర్హాజరయిన తెంటు
పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి పార్టీ ఇన్‌ఛార్జి తెంటు లక్ష్ముమ్ నాయుడు గైర్హాజరయ్యారు. వాస్తవానికి ఇన్‌చార్జి హోదాలో కార్యక్రమం నిర్వహించాల్సి ఉన్నా ఆయన రాలేదు. ప్రతీ సమావేశానికి హాజరయ్యే ఆయన ఈసారి హాజరు కాకపోవడంతో పార్టీలో సుదీర్ఘచర్చ జరుగుతోంది. పార్టీలో నెలకొన్న విభేదాలే కారణమని తెలుస్తోంది. మంత్రి అనుయాయులంతా రాజులకే ప్రాధాన్యమివ్వడం, పార్టీ కార్యక్రమాలకు, పార్టీకి విలువనివ్వకపోవడంతో తెంటు కూడా మనస్థాపం చెందుతున్నట్టు చర్చించుకుంటున్నారు. అదే విషయాన్ని ఆయన అనుచరుడయిన తూమురోతు వెంకట్‌ ఒక్కసారిగా మంత్రి సమావేశంలోనే బయటపెట్టినట్లు పార్టీలో చర్చించుకుంటున్నారు.

ఆత్మహత్య చేసుకుంటానంటూ హల్‌చల్‌
ఉదయం వివాదం ముగిసిందనుకుంటే సాయంత్రం మళ్లీ మొదలైంది. బొబ్బిలి కోట దక్షిణ దేవిడీ వద్ద గల ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు వెంకట్‌ చేరుకుని తాను భార్యాపిల్లలతో కలసి ఆత్మహత్యాయత్నం చే కుంటున్నానని హల్‌ చల్‌ చేశారు. తెంటు లక్ష్ముమ్ నాయుడు తదితరులు ఫోన్‌ చేసి వారించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు రాంబార్కి శర వచ్చి ఏమైందంటూ అడగ్గా తాను ఆత్మహత్య చేసుకోనున్నట్లు వెంకట్‌ చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. అనంతరం కౌన్సిలర్‌ ఆర్‌.ఎల్‌.వి.ప్రసాద్‌ వచ్చి ఆయన్ను తీసుకెళ్లిపోవడంతో అప్పటికి కథ సుఖాంతమైంది. బొబ్బిలి టీడీపీలో భగ్గుమన్న విభేదాలపై ఇంటిలిజెన్స్‌ వర్గాలు పార్టీ అధిష్టానానికి, పోలీసు ఉన్నతాధికారులకూ సమాచారమందించారు.

మరిన్ని వార్తలు