సిద్ధూ ఓటమి ఖాయం

21 Apr, 2018 08:18 IST|Sakshi
ఎన్‌వై గోపాలకృష్ణను బీజేపీలోకి ఆహ్వానిస్తున్న బీఎస్‌ యడ్యూరప్ప

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప

బీజేపీలో చేరిన ఎన్‌వై గోపాలకృష్ణ, చలవాది నారాయణస్వామి

సాక్షి, బెంగళూరు: ‘వచ్చే నెలలో జరిగే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 50 సీట్లు కూడా రావు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చాముండేశ్వరి, బాదామి నియోజకవర్గాల్లోఓడిపోతారు. ఆయన తనయుడు యతీంద్ర కూడా వరుణ నియోజకవర్గంలో ఓడిపోతారు’ అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప జోస్యం చెప్పారు. మరో నెల రోజుల్లో తాను సీఎం పదవి చేపడుతానన్నారు. రాష్ట్రంలో బీజేపీ అత్యధిక సీట్లు సాధించి అధికారంలోకి వస్తుందని చెప్పారు.

బీజేపీలో చేరిక : కాంగ్రెస్‌ తరఫున ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎన్‌వై గోపాలకృష్ణ ఆ పార్టీకి రాజీనామా చేసి శుక్రవారం బీఎస్‌ యడ్డూరప్ప సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయనతో పాటు చలవాది నారాయణస్వామి, పూర్ణిమ మల్లేష్‌ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈసందర్భంగా వారు బీఎస్‌ యడ్డూరప్ప నివాసానికి వెళ్లి కలిశారు. బీఎస్‌ యడ్యూరప్ప వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా యడ్యూరప్ప మాట్లాడుతూ... మే నెలలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌ 50 – 60 సీట్లు మాత్రమే సాధిస్తుందన్నారు. సీఎం సిద్ధరామయ్యకు ఓటమి తప్పదన్నారు.
రూ.5 కోట్లకు టికెట్‌ : చలవాది నారాయణస్వామి మాట్లాడుతూ.... కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు డాక్టర్‌ జి.పరమేశ్వర్‌ టికెట్లను అమ్ముతున్నారని ఆరోపించారు. ఈమేరకు బెంగళూరు నగరంలోని మహదేవపుర, నెలమంగళ టికెట్లను రూ.5 కోట్లు చొప్పున విక్రయించారన్నారు.

మరిన్ని వార్తలు