ఉత్తమ్‌కుమార్‌పై క్రిశాంక్‌ గుస్సా...

18 Mar, 2019 09:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : లోక్‌సభ ఎన్నికల్లో తనకు టికెట్‌ ఇవ్వకపోవడంపై ఓయూ విద్యార్థి నేత క్రిశాంక్‌ ...తెలంగాణ పీసీసీ అధికార ప్రతినిధి, కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.  పార్టీలో తనకు అవమానాలే ఎదురవుతున్నాయంటూ ఆయన.. సెల్ఫీ వీడియోలో  టీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాకుండా ఉత్తమ్‌ తీరును నిరసిస్తూ సుమారు రూ.15 లక్షలలో సిద్ధం చేసుకున్న ఎన్నికల సామాగ్రిని పెట్రోల్‌ పోసి నిప్పు అంటించారు. 

ఈ సందర్భంగా క్రిశాంక్‌ మాట్లాడుతూ.. ’ ఉత్తమ్‌ కుమార్‌ వద్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నష్టపోతోంది. ఇక ఆ పార్టీ మిగలదు. పార్టీ మీటింగ్‌ల కోసం ఉచితంగా గార్డెన్స్‌, హాల్స్‌ మాట్లాడాలని అర్థరాత్రి కూడా ఫోన్లు చేసిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి...నేను రాజీనామా చేసినట్లు తెలిసినా కనీసం ఫోన్‌ చేయకపోవడం ఎంతవరకూ న్యాయం. మొన్నటి ఎన్నికల్లో తనకు టికెట్‌ ఇస్తారన్న నమ్మకంతో ఎన్నికలలో ప్రచారం చేసుకునేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాను. కానీ అప్పుడు కూడా టికెట్‌ ఇవ్వకుండా మోసం చేశారు. ఇప్పటికీ పార్టీలో అవమానపరుస్తున్నారు. అందుకే పార్టీ వీడుతున్నా.’  అని తెలిపారు.

కాగా ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్‌ తనకే ఇస్తారన్న ఉద్దేశంతో క్రిశాంక్‌ కొంతకాలంగా నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. అయితే సొంత మామ సర్వే సత్యనారాయణ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా టికెట్ సంపాదించుకున్నారు. దీంతో ఓ దశలో క్రిశాంక్‌ స‍్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధం అయ్యారు. అయితే అధిష్టానం బుజ్జగింపులతో పాటు, లోక్‌సభ టికెట్‌ అంశాన్ని పరిశీలిస్తామంటూ హామీతో ఆయన వెనక్కి తగ్గారు. అయితే లోక్‌సభ టికెట్‌ విషయంలోనూ పార్టీ నుంచి మొండి చేయి ఎదురుకావడంతో, యువత రాజకీయాలలోకి రావాలంటారని, కానీ వస్తే ఆదరించరని, టికెట్ అడిగితే బచ్చాగాడివంటారంటూ క్రిశాంక్‌ గుస్సాగా ఉన్నారు.

మరిన్ని వార్తలు