పార్టీ మారడంపై ముఖేష్‌గౌడ్‌ క్లారిటీ!

1 Jul, 2018 14:26 IST|Sakshi

టీఆర్‌ఎస్‌లో చేరిక వార్తలను ఖండించిన మాజీ మంత్రి

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్‌ తన రాజకీయ భవితవ్యంపై నిర్ణయం ప్రకటించేశారు. కాంగ్రెస్‌ పార్టీని వీడటం లేదని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్‌ పార్టీని వీడనున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. ఆదివారం తన జన్మదినం సందర్భంగా జాంబాగ్‌లోని క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలు, అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్యకర్తలతో చర్చించిన అనంతరం పార్టీ మారడం లేదని చెప్పారు. కాంగ్రెస్‌లో బీసీలకు ఎలాంటి అన్యాయం జరగలేదన్నారు. అనేక మంది బీసీ నేతలు కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నట్లు ముఖేష్‌గౌడ్‌ తెలిపారు.

నేటి నుంచి నియోజక వర్గాలవారీగా కార్యకర్తలతో సమావేశాలను ఏర్పాటు చేసి.. చివరగా కార్యకర్తల అభీష్టం మేరకు భవిష్యత్‌ కార్యాచరణపై తుది నిర్ణయం తీసుకుంటానన్నారు. మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, వి హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌ కాంగ్రెస్‌లో క్రియాశీలక నాయకునిగా, మాజీ మంత్రిగా తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వంపై గుర్రుగా ఉన్నట్లు జరిగిన ప్రచారంపై ఆయన స్పందించ లేదని సమాచారం. గాంధీభవన్‌లో జరిగే సమావేశాలకు కూడా చాలాకాలంగా హాజరుకావడం లేదన్న విషయం తెలిసిందే. శనివారం జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్షకు కూడా తండ్రీతనయులు గైర్హాజరయ్యారు.

మరిన్ని వార్తలు