రాజ్యసభలో ‘ఎలక్టోరల్‌’ రచ్చ

23 Nov, 2019 02:58 IST|Sakshi
పార్లమెంట్‌ ప్రాంగణంలో కాంగ్రెస్‌ సభ్యుల నిరసన

ప్రధాని మోదీ సమాధానమివ్వాలన్న ప్రతిపక్షం

పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లో నిరసన

న్యూఢిల్లీ: ఎలక్టోరల్‌ బాండ్ల అంశంపై రాజ్యసభ శుక్రవారం అట్టుడికింది. ఈ విషయంపై సభలో చర్చ జరగాలని, ప్రధాని మోదీ సమాధానమివ్వాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. చైర్మన్‌ వెంకయ్య తిరస్కరించడంతో పార్లమెంట్‌ ఆవరణలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ప్రతిపక్షాలు నిరసనలు తెలిపాయి. దీనిపై సభలో చర్చ జరగాలంటూ రాజ్యసభలో శుక్రవారం ప్రతిపక్షాలు 267వ నిబంధన కింద నోటీసులిచ్చాయి. ఇది తీవ్రమైన అంశమని, ఇందుకు సంబంధించిన అన్ని అంశాలను ప్రభుత్వం వెల్లడించాలని కాంగ్రెస్‌ సభ్యుడు ఆనంద్‌ శర్మ డిమాండ్‌ చేశారు.

అయితే, మిగతా కార్యక్రమాలను పక్కనబెట్టి, చర్చించేంత ముఖ్యమైన విషయం కాదని, కావాలనుకుంటే ఇతర నిబంధనల కింద చర్చకు కోరవచ్చని చైర్మన్‌ వెంకయ్య అన్నారు. సభ్యులు నిరసనలు కొనసాగిస్తుండటంతో సభను వాయిదా వేస్తానన్న చైర్మన్‌ హెచ్చరికతో గందరగోళం సద్దుమణిగింది. అనంతరం సభ్యులు పార్లమెంట్‌ ఆవరణలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. బాండ్లపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు, అనుమానాలపై ప్రధాని మౌనం వీడాలన్నారు.

చట్టబద్ధ రాజకీయ అవినీతి: సీపీఎం
‘ఎలక్టోరల్‌ బాండ్లను రద్దు చేయాలి. ఇది చట్టబద్ధ రాజకీయ అవినీతిగా మారింది. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ఈ డబ్బును నిబంధనలకు విరుద్ధంగా శాసనసభ్యులను కొనుగోలు చేసేందుకు బీజేపీ వాడుతోంది’అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  జేఎన్‌యూ ఫీజు పెంపుపై వివాదం జేఎన్‌యూ హాస్టల్‌ విద్యార్థుల ఫీజు పెంపు, విద్యార్థుల డ్రెస్‌ కోడ్‌ తదితర అంశాల తాజా ప్రతిపాదనలపై రాజ్యసభలో వామపక్ష పార్టీలు, అధికార పక్షం సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కాగా, జేఎన్‌యూ విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యంపై న్యాయ విచారణ జరిపించాలంటూ జీరో అవర్‌లో సీపీఎంకు చెందిన కేకే రాగేశ్‌ డిమాండ్‌ చేయగా చైర్మన్‌ వెంకయ్య నాయుడు తిరస్కరించారు.

ఢిల్లీలో నీటి నాణ్యతపై వాగ్యుద్ధం
ఢిల్లీ వాసులకు అందించే నల్లా నీటి నాణ్యతపై తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంపై చైర్మన్‌ వెంకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.  బీజేపీకి చెందిన విజయ్‌ గోయెల్‌ జీరో అవర్‌లో ఢిల్లీ నీటి నాణ్యత అంశాన్ని లేవనెత్తారు. సురక్షితం కాని నీరు ఢిల్లీ వాసులకు అందుతోందని ఆరోపించగా ఆప్‌ సభ్యుడు సంజయ్‌ అరుస్తూ అంతరాయం కలిగించారు. ‘ఆ సమస్యను పరిష్కరించడానికి మీరేమైనా మంత్రా?’అని వెంకయ్య ఆగ్రహంతో ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు