బీసీలకు అన్యాయం చేస్తున్నారు: దాసోజు

10 Jun, 2018 00:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు న్యాయ బద్ధమైన వాటా రావాలంటే బీసీ జనాభా గణన శాస్త్రీయంగా చేపట్టాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బీసీ సాధికారిక కమిటీ సభ్యుడు దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు. పంచాయతీరాజ్‌ చట్టాన్ని లోపభూయిష్టంగా తయారు చేశారని, పరస్పర విరుద్ధ అంశాలను చట్టంలో పొందుపరిచారని ఆయన విమర్శించారు. ఈ మేరకు శనివారం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు.

15 రోజుల్లో జనాభా లెక్కలు చేపట్టి రిజర్వేషన్లు అమలు చేయాలని పంచాయతీరాజ్‌ చట్టంలో పేర్కొన్నారని, 12 వేల పంచాయతీల్లో జనాభా గణనకు 15 రోజులు సమయం ఎలా సరిపోతుందని ఆయన ఆ లేఖలో ప్రశ్నించారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా అధికారికంగా తేలిన 52 శాతం ప్రకారం బీసీలకు పంచాయతీరాజ్‌ ఎన్నికలలో రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న ఆర్టీసీ కార్మికులు న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తామంటే ఎస్మా ప్రయోగిస్తామని సీఎం కేసీఆర్‌ హెచ్చరించడం రాజ్యాంగ విరుద్ధమని శ్రవణ్‌ అన్నారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులపై ఎస్మా ప్రయోగిస్తుంటే కాంగ్రెస్‌ పార్టీ చూస్తూ ఊరుకోదని, తస్మాత్‌ జాగ్రత్త అని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు