సమ్మె సస్పెన్స్‌ ! | Sakshi
Sakshi News home page

సమ్మె సస్పెన్స్‌ !

Published Sun, Jun 10 2018 12:41 AM

Strike Supence In Telangana RTC Employees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ సమ్మెను నిలువరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. శనివారం ఏడుగురు మంత్రులు రంగంలోకి దిగి గుర్తింపు కార్మిక సంఘం టీఎంయూ నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం ప్రగతి భవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో భేటీ అయి కార్మిక సంఘాల డిమాండ్లు, సమ్మె పరిస్థితిపై చర్చించారు. టీఎంయూ ప్రతినిధులను కూడా ప్రగతి భవన్‌కు పిలిపించినా ముఖ్యమంత్రి వారితో నేరుగా మాట్లాడేందుకు నిరాకరించారు. మంత్రులు మాత్రం రాత్రి పదిన్నర గంటల వరకు కూడా ప్రగతి భవన్‌లోనే ఉండి.. ముఖ్యమంత్రితో చర్చించారు. దీంతో ఆదివారం కీలక ప్రకటన వెలువడవచ్చని భావిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ వేసిన నేపథ్యంలో.. ఆర్టీసీ కార్మికులకు కనీసం మధ్యంతర భృతి (ఐఆర్‌) ప్రకటిస్తే బాగుంటుందని మంత్రులు అభిప్రాయపడినట్టు తెలిసింది. కానీ సీఎం నుంచి స్పష్టమైన హామీ రాలేదని సమాచారం. సోమవారం తెల్లవారుజాము నుంచే సమ్మె ప్రారంభిస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాలు పేర్కొన్న నేపథ్యంలో.. ఆలోపే సమ్మె విరమణ ప్రకటన వస్తుందని ఓ మంత్రి వ్యాఖ్యానించారు. 

తొలుత హరీశ్‌ నివాసంలో.. 
సమ్మె చేస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తామంటూ సీఎం నేరుగా హెచ్చరించినా.. సమ్మెకు కట్టుబడే ఉన్నామని, సోమవారం తెల్లవారుజాము నుంచే సమ్మె ప్రారంభిస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో సమస్య పరిష్కారం కోసం మంత్రులు రంగంలోకి దిగారు. అయితే ఆర్టీసీ గుర్తింపు సంఘం టీఎంయూకు మంత్రి హరీశ్‌రావు గౌరవాధ్యక్షుడిగా ఉన్నా.. ఇప్పటివరకు సమ్మె వ్యవహారంపై స్పందించలేదు. టీఎంయూ నేతలు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కొంతకాలంగా వారితో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే శనివారం ఉదయం కొందరు టీఎంయూ నేతలు హరీశ్‌రావు ఇంటికి వెళ్లారు. టీఎంయూ నేతలు వారంతట వారే వచ్చి కలవడంతో హరీశ్‌రావు చర్చలకు సిద్ధమయ్యారు. వారిని మంత్రుల క్వార్టర్స్‌లోని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నివాసానికి తీసుకెళ్లారు. మంత్రులు ఈటల రాజేందర్, మహేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, జగదీశ్‌రెడ్డిలను కూడా అక్కడికి పిలిపించారు. ఆర్టీసీ వేతన సవరణ మంత్రుల కమిటీలో సభ్యుడిగా ఉన్న కేటీఆర్‌ కూడా వచ్చి టీఎంయూ నేతలతో చర్చల్లో పాల్గొన్నారు. 

ప్రభుత్వ తోడ్పాటు ఏదీ? 
మంత్రులు–టీఎంయూ నేతల చర్చల్లో ఆర్టీసీ నష్టాల అంశం ప్రస్తావనకు వచ్చింది. ఆర్టీసీ నష్టాలపై సీఎం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని.. నష్టాలు తగ్గించేందుకు కలసిరాని కార్మిక నేతలు భారీగా వేతనాల పెంపు కోసం డిమాండ్‌ చేస్తూ సమ్మెకు సిద్ధపడటాన్ని తప్పుబడుతున్నారని మంత్రులు పేర్కొన్నారు. దీంతో కార్మిక సంఘం నేతలు ఆర్టీసీ యాజమాన్యంపై విరుచుకుపడ్డారు. అధికారుల చేష్టల వల్లనే ఆర్టీసీ నష్టాలు పెరిగిపోతున్నాయని, అందులో కార్మికుల పాత్ర లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం తలుచుకుంటే ఆర్టీసీలో నష్టాలు లేకుండా చేయగలదని, కానీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆర్టీసీ వినియోగిస్తున్న డీజిల్‌పై వ్యాట్‌ తగ్గిస్తే సంస్థపై భారం తగ్గతుందని, ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నంచారు. ప్రైవేటు వాహనాల తరహాలో ఆర్టీసీ బస్సులపైనా వసూలు చేస్తున్న మోటారు వాహనాల పన్నును మినహాయించాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాలు స్టేజీ క్యారియర్లుగా తిరుగుతుండటంతో ఆర్టీసీ ఆదాయం కోల్పోతోందని.. వాటిని నియంత్రిస్తే సమస్య పరిష్కారమవుతుందని సూచించారు. ఏపీ నుంచి తెలంగాణకు ఆ రాష్ట్ర బస్సులు పెద్ద సంఖ్యలో తిరుగుతున్నా.. తెలంగాణ బస్సులు చాలా తక్కువ సంఖ్యలో ఏపీ పరిధిలోకి ప్రయాణిస్తున్నాయని, తెలంగాణ ఆర్టీసీ కూడా ఏపీకి బస్సుల సంఖ్య పెంచితే ఆదాయం పెరుగుతుందని స్పష్టం చేశారు. డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌లు పదవీ విరమణ పొందుతున్నా కొత్త రిక్రూట్‌మెంట్‌ లేక ఐదు వేల ఖాళీలు ఏర్పడ్డాయని, వాటిని భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇక తాము 50 శాతం వేతన సవరణ డిమాండ్‌ చేస్తున్నామని.. ఇప్పటికిప్పుడు వేతనాలు పెంచకున్నా 20–25 శాతం మధ్యంతర భృతి (ఐఆర్‌) అయినా ప్రకటించాలని కోరారు. ఈ అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి, తగిన హామీ వచ్చేలా చూస్తామని కార్మిక సంఘం నేతలకు మంత్రులు చెప్పారు. ఈ భేటీ అనంతరం ప్రధాన బస్‌స్టేషన్‌ అయిన ఇమ్లీబన్‌కు వెళ్లిన టీఎంయూ నేతలు.. అక్కడ కార్మికులతో సమ్మె సన్నాహకంగా బహిరంగసభ నిర్వహించారు. 

సీఎంతో మంత్రుల సుదీర్ఘ భేటీ 
కార్మిక సంఘాల నేతలతో భేటీ అనంతరం మంత్రులు ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి తెలంగాణ భవన్‌కు వెళ్లారు. తర్వాత సమ్మె అంశంపై చర్చించేందుకు ప్రగతిభవన్‌కు వచ్చారు. ఇదే సమయంలో టీఎంయూ నేతలను కూడా ప్రగతిభవన్‌కు పిలిపించారు. కానీ కార్మిక సంఘం నేతలతో భేటీ అయ్యేందుకు సీఎం అంగీకరించకపోవడంతో.. మంత్రులే వారితో కొంతసేపు మాట్లాడి పంపించేశారు. తర్వాత దాదాపు మూడు గంటల పాటు సీఎంతో భేటీ అయి చర్చించారు. అనంతరం రాత్రి పదిన్నర గంటల సమయంలో కొందరు మంత్రులు మంత్రి ఈటల రాజేందర్‌ నివాసానికి వెళ్లి సమావేశమయ్యారు. కార్మిక సంఘం నేతలు కూడా ఇందులో పాల్గొన్నారు. అయితే ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ప్రతిష్టంభన మాత్రం కొనసాగుతున్నట్టయింది. అయితే సుదీర్ఘ మంతనాలు, చర్చల నేపథ్యంలో.. ఆర్టీసీ సమ్మె యోచన విరమించుకునేలా ఆదివారం ప్రకటన వెలువడే అవకాశముందని అంటున్నారు.

Advertisement
Advertisement