‘ఇంతవరకు రూ. 2 వేల పింఛను ఇవ్వలేదు’

15 Jul, 2019 14:49 IST|Sakshi
డీకే అరుణ(ఫైల్‌ ఫొటో)

హైదరాబాద్‌ : పార్లమెంట్‌ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల నిర్వహిస్తే తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అధికారంలో వచ్చేది కాదని బీజేపీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో ఇప్పటివరకు 50 శాతం మంది రైతులకు రైతుబంధు అందలేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలు బీజేపీని నాలుగు పార్లమెంట్‌ స్థానాలు గెలిపించి సీఎం కేసీఆర్‌కు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారని తెలిపారు. ఎన్నికల సమయంలో రెండు వేల రూపాయల పింఛన్‌ ఇస్తానని చెప్పిన కేసీఆర్‌ ఇంతవరకు ఇవ్వలేదని మండిపడ్డారు. 

టీఆర్‌ఎస్‌ ఉద్యమం కరీంనగర్‌లో పుట్టిందని చెప్పే కేసీఆర్‌ను అక్కడి ప్రజలే పార్లమెంట్‌ ఎన్నికల్లో మట్టి కలిపించారంటే.. ఇక టీఆర్‌ఎస్‌ పార్టీ పతనం అయినట్టేనని వ్యాఖ్యానించారు. అమలు చేయని పథకాలను పెట్టి అమాయకపు ప్రజలను మోసం చేసి కేసీఆర్‌ గద్దెనెక్కారని విమర్శించారు. కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బంగారం అయిందని.. తెలంగాణ రాష్ట్రం అప్పులపాలైందని ఆరోపించారు. ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్‌కు మంచి నైపుణ్యం ఉందని ఎద్దేవా చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారని.. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు