మోదీ ఇమేజ్‌ మసకబారుతోంది

28 Apr, 2018 13:12 IST|Sakshi
గిడుగు రుద్రరాజును సత్కరిస్తున్న డీసీసీ అధ్యక్షుడు పంతం నానాజీ తదితరులు

ఏఐఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు

నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్‌

కాకినాడ / మధురపూడి (రాజానగరం): అసమర్థ విధానాల కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్‌ క్రమంగా పడిపోతోందని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు అన్నారు. ఏఐసీసీ కార్యదర్శిగా నియమితులైన అనంతరం తొలిసారిగా జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు మధురపూడిలోని రాజమహేంద్రవరం విమానాశ్రయంలో ఆ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడినుంచి కాకినాడకు ర్యాలీగా ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా కాకినాడలోను, అంతకుముందు ర్యాలీ సాగిన మార్గంలో దోసకాయలపల్లి గ్రామంలోను రుద్రరాజు విలేకర్లతో మాట్లాడారు. 2019 నాటికి మోదీ సర్కార్‌ గ్రాఫ్‌ తోకచుక్క రాలినంత వేగంగా పడిపోతుందన్న విషయాన్ని పరిణతి చెందిన రాజకీయ విశ్లేషకులు సహితం స్పష్టం చేస్తున్నారన్నారు.

మోదీ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క వర్గం సంతృప్తికరంగా లేదన్నారు. విభజన హామీలు అమలు కాకపోవడం, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు సహా అనేక అంశాల విషయంలో బీజేపీ సర్కార్‌ వైఖరిపై రాష్ట్ర ప్రజలు అసహనంతో ఉన్నారని అన్నారు. రాష్ట్రానికి అందించిన నిధులు, వాటి ఖర్చుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి ఎన్నో నిధులు విడుదల చేశామని, వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు సక్రమంగా ఖర్చు చేయలేదని కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తోందని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగేళ్లుగా తాత్సారం చేశాయని ఆరోపించారు. హోదా వచ్చేది కాంగ్రెస్‌తోనేని గిడుగు అన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నిస్తోందని విమర్శించారు. విభజన చట్టం ప్రకారం పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రానిదేనన్నారు. యూపీఏ అధికారంలోకి రాగానే విభజన చట్టంలోని 19 అంశాలూ అమలవుతాయని చెప్పారు.

కాంగ్రెస్‌ పూర్వ వైభవానికి కృషి చేస్తా
కాకినాడ: కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే తన ప్రధాన కర్తవ్యమని, ఇందుకోసం నాయకులు, కార్యకర్తల సమన్వయంతో పని చేస్తానని గిడుగు రుద్రరాజు అన్నారు. డీసీసీ అధ్యక్షుడు పంతం నానాజీ అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం కాకినాడలోని కళావెంకట్రావు భవన్‌లో జిల్లా కాంగ్రెస్‌ విస్తృత సమావేశం జరిగింది. ఏఐసీసీ కార్యదర్శిగా నియమితులైన గిడుగును పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా ఘనంగా సత్కరించాయి. సాధారణ కార్యకర్తగా పార్టీలో సేవలు అందిస్తున్న తనను మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి గుర్తించి, ఉన్నత స్థాయికి ఎదిగేలా ప్రోత్సహించారన్నారు. వైఎస్సార్‌ ప్రోత్సాహంతోనే ఎమ్మెల్సీగా, వైద్య, ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్‌గా సేవలు అందించగలిగానన్నారు. విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, బీజేపీలు ఆంధ్రప్రదేశ్‌కు తీరని ద్రోహం చేశాయని విమర్శించారు. సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్‌ బీసీ సెల్‌ అధ్యక్షుడు నులుకుర్తి వెంకటేశ్వరరావు, పీసీసీ కార్యదర్శులు ఎస్‌ఎన్‌ రాజా, మట్టా శివప్రసాద్, బోణం భాస్కర్, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సబ్బతి ఫణీశ్వరరావు, జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బోడా వెంకట్, వివిధ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, రాష్ట్ర కాంగ్రెస్‌ అధికార ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు