గోవా సీఎం పారికర్‌ కన్నుమూత

17 Mar, 2019 20:12 IST|Sakshi

సాక్షి, పణాజీ :  దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్నగోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ (63) కన్నుమూశారు. ఆదివారం రాత్రి ఆయన మరణించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి.  ఇవాళ సాయంత్రం పారికర్‌ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని, డాక్టర్లు తమ శాయశక్తులా ఆయనకు వైద్యం అందిస్తున్నారని గోవా సీఎంవో ట్వీట్‌ చేసింది. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే పారికర్‌ మరణవార్త వినాల్సి వచ్చింది.

ప్యాంక్రియాటిక్‌ వ్యాధితో బాధపడుతున్న పారికర్‌ ఢిల్లీలోని ఎయిమ్స్‌, గోవా, ముంబైలోనూ చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత అమెరికాలో సుదీర్ఘ చికిత్స తీసుకున్నా అయినా ఫలితం లేకపోయింది. కొంత కాలంగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. అలాంటి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది జనవరి 30న అసెంబ్లీలో పారికర్‌ బడ్జెట్ ప్రవేశపెట్టారు. గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఇవాళ మృతి చెందారు. 

1955 డిసెంబర్‌ 13న గోవాలో జన్మించిన పారికర్‌ ఐఐటీలో గ్రాడ్యుయేషన్ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి బీజేపీలోకి వచ్చిన ఆయన 1994లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1999లో గోవా అసెంబ్లీలో విపక్షనేతగా ఉన్నారు. 2000లో తొలిసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన పారికర్‌.... ప్రధాని మోదీ కేబినెట్‌లో రక్షణమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. పారికర్‌ హయాంలోనే ఫ్రాన్స్‌తో రఫెల్‌ యుద్ధ విమానాల ఒప్పందం జరిగింది.

ప్రముఖుల సంతాపం
మరోవైపు పారికర్‌ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రాంనాధ్‌ కోవింద్‌తో పాటు, బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. ఇక పారికర్‌ మరణంతో బీజేపీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా పారికర్‌ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. దేశం ఒక గొప్ప ప్రజా సేవకుడిని కోల్పోయిందని సీఎం అన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

పారికర్‌ ఆకస్మిక మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.  దేశం ప్రజ్ఞాశాలి అయిన ఒక ప్రజా నాయకుడుని కోల్పోయిందని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు గవర్నర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మరిన్ని వార్తలు