‘అలాంటి అమ్మాయిలను చూస్తే భయమేస్తోంది’

10 Feb, 2018 09:44 IST|Sakshi

సాక్షి, పనాజీ : భారత్‌లో మద్యం సేవించే యువతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోందని సర్వేలో స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోవా ముఖ్యమంత్రి మనోహర్‌పారికర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు కూడా బీర్లు తాగటం మొదలుపెట్టేశారని.. వారిని చూస్తుంటే తనకి భయమేస్తోందని ఆయన అంటున్నారు.

‘‘అమ్మాయిల్లో ఆల్కహాల్ సేవించే అలవాటు పెరిగిపోయింది. అది పరిమితి ఎప్పుడో దాటి పోయింది. బీర్లు ఎగబడి తాగేస్తున్నారు. ఇది నాకు ఎంతో భయాన్ని కలగజేస్తోంది’ అని పారికర్ పేర్కొన్నారు. గోవాలో జరిగిన స్టేట్ యూత్ పార్లమెంట్ కు హాజరైన యువతను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఈ మాట అమ్మాయిలందరినీ ఉద్దేశించి నేను అనటం లేదు. ఇక్కడున్న వాళ్లలో ఆ అలవాటు లేకపోలేదు.  కానీ, గోవాలో గత రెండేళ్లలో మద్యం సేవిస్తున్న అమ్మాయిల సంఖ్య మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. దీనికి అడ్డుకట్ట పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని పారికర్‌ అభిప్రాయపడ్డారు. 

ఇక గోవాలో మాదకద్రవ్యాల వ్యాపారంపై ఆయన మాట్లాడుతూ..  డ్రగ్ నెట్ వర్క్ ను అంతమొందించే ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు.  కాలేజీలో డ్రగ్స్ సంస్కృతి ఎక్కువగా ఉందని తాను భావించడం లేదని.. కానీ, మొత్తానికి లేదన్న వాదనతో మాత్రం తాను ఏకీభవించబోవని చెప్పారు. ఇప్పటి వరకు 170 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. చట్టంలోని లోపాలతో నిందితులు త్వరగతిన బయటపడుతున్నారని.. అందుకే శిక్షాస్మృతిని సవరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇక నిరోద్యోగ సమస్యపై స్పందిస్తూ... గోవా యువత కష్టపడి పని చేయడానికి ఇష్టపడటం లేదని... సింపుల్ వర్క్ వైపే మొగ్గుచూపుతున్నారని చెప్పారు. గవర్నమెంట్ జాబ్ అంటే పని ఉండదనే భావంతో ఉన్నారని పారికర్‌ అసహనం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు