గాంధీ కుటుంబానికి షాకిచ్చిన కేంద్రం!

8 Nov, 2019 16:17 IST|Sakshi

ఎస్పీజీ భద్రత తొలగింపు!

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్న గాంధీ కుటుంబానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకలకు ప్రస్తుతం కల్పిస్తున్న స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌(ఎస్పీజీ)ను ఉపసంహరించుకోవాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వీరి భద్రతకు ఎలాంటి ముప్పు లేదని భావిస్తోన్న కేంద్రం.. ఎస్పీజీని తొలగించి జెడ్‌ప్లస్‌ భద్రతను కల్పించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఎస్పీజీ భద్రతను కేవలం రాష్ట్రపతి, దేశ ప్రధానికి మాత్రమే కేటాయిస్తారని, ఇతర నేతలకు అవసరం లేదని కేంద్రం భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న ఎస్పీజీ చట్టానికి సవరణ చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని, దాని కొరకు త్వరలోనే పార్లమెంట్‌లో ప్రత్యేక బిల్లును ప్రవేశపెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తాజా వార్తల నేపథ్యంలో మోదీ ప్రభుత్వంపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. విపక్షాలపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా మాజీ ప్రధాని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు కూడా ఇటీవల ఎస్పీజీ భద్రతను కేంద్రం ఉపసంహరించుకున్న విషయ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు జెడ్‌ప్లస్‌ భద్రతను కల్పిస్తున్నారు.

మరిన్ని వార్తలు