ఖమ్మం కాంగ్రెస్‌లో కుమ్ములాట!

6 Aug, 2018 00:49 IST|Sakshi

భట్టి, రేణుక, పొంగులేటి, సంభాని వర్గాల రాజకీయం

పార్టీలో చేరికలు, ప్రాధాన్యతలపై ఎవరి దారి వారిదే

నాలుగు నెలలుగా వీడని డీసీసీ పదవి చిక్కుముడి

చాంతాడంత జాబితాతో టీపీసీసీకి తలనొప్పి

జిల్లాలో జోరందుకున్న గ్రూపు రాజకీయాలు

సాక్షి, హైదరాబాద్‌: ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో నాలుగు స్తంభాలాట నడుస్తోంది. జిల్లా నుంచి పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌ల మధ్య సమన్వయం కుదరక ఎవరికి వారే వ్యవహరిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నా సమన్వయ లోపాన్ని నివారించే ప్రయత్నం జరగకపోవడంతో జిల్లా పార్టీలో గ్రూపు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి.

డీసీ సీ అధ్యక్ష పదవి ఖాళీ అయి 4 నెలలవుతున్నా భర్తీలో ఏకాభిప్రాయం కుదరకపోవడం, కొందరు నేతలను పార్టీలో చేర్చుకునే విషయంలో తలో మాట చెబు తుండటం, పార్టీ పెద్దల సమక్షంలోనే బల నిరూపణ కు యత్నించడం, కొందరికి వ్యతిరేకంగా, అనుకూలంగా ఆందోళనలు గాంధీభవన్‌ మెట్లెక్కడం ఖమ్మం కాంగ్రెస్‌ కేడర్‌ను అయోమయానికి గురిచేస్తోంది.  

అంతా కంగాళీ
వాస్తవానికి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉంది. గత ఎన్నికల్లో 3 అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానాన్ని మిత్రపక్షం సీపీఐకు కేటాయించినా 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ విజయం సాధించింది. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక పరిస్థితుల్లో కొంత మార్పొచ్చినా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ కేడర్‌ బలంగానే ఉంది. కానీ ఈ కేడర్‌ను ఏకతాటిపైకి తీసుకురావడంలో మాత్రం జిల్లా నాయకత్వం విఫలమవుతోంది.

దీనికి తోడు తాజా పరిణామాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరిపై ఆర్థిక ఆరోపణలు చేస్తూ వైరా నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడి భార్య గాంధీభవన్‌లో ధర్నా చేయడం ఖమ్మం రాజకీయాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఆమెను కొందరు వెనుక ఉండి నడిపిస్తున్నారని, రేణుక చరిష్మాను దెబ్బతీసేందుకే ఇలా చేస్తున్నారని రేణుక వర్గం ఆరోపిస్తోంది. ఈ విషయంలో మిగిలిన కీలక నేతలు గుంభనంగానే ఉన్నా కొందరు స్థానిక నేతలు ప్రోత్సహిస్తుండటం రేణుక వర్గానికి మింగుడు పడటం లేదు.  

ప్రసాదరావు విషయంలో..
సీనియర్‌ నేత జలగం ప్రసాదరావును పార్టీలో చేర్చుకునే విషయంలోనూ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఈ విషయంలో భట్టి తటస్థంగా ఉంటున్నా ప్రసాదరావు చేరికను పొంగులేటి, రేణుక బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. ప్రసాదరావు చేరికపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియాతో పొంగులేటి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. మరోవైపు పార్టీలో తమ చేరికకు లైన్‌ క్లియర్‌ అయిందని, వారం రోజుల్లోనే తాము కాంగ్రెస్‌ కండువాలు కప్పుకోవడం తథ్యమని ప్రసాదరావు వర్గం అంటోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో రేణుకాచౌదరి, జలగం ప్రసాదరావుల అంశాలను పార్టీ ఎలా పరిష్కరిస్తుందోనని ఆసక్తి నెలకొంది.  

డీసీసీ కోసం ‘ఢీ’
ఇక ఖమ్మం కాంగ్రెస్‌ను ప్రధానంగా వేధిస్తున్న సమస్య డీసీసీ అధ్యక్ష పదవి. డీసీసీ అధ్యక్షునిగా ఉన్న అయితం సత్యం 4 నెలల క్రితం మరణించడంతో ఖాళీ అయిన ఆ పదవిని తమ వారికే ఇప్పించాలని కీలక నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. డీసీసీ రేసులో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈయన పేరును బహిరంగంగా ఎవరూ వ్యతిరేకించకున్నా తమ వర్గం నేతలకు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. రేసులో రేణుక వర్గానికి చెందిన పోట్ల నాగేశ్వరరావు, దిలిశాల భద్రయ్య, మానుకొండ రాధాకిషోర్, ఎం. శ్రీనివాసయాదవ్, ఎడవెల్లి కృష్ణల పేర్లు వినిపిస్తున్నాయి.

భట్టి మాత్రం పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుని హోదాలో హుందాగానే ఉంటూ ఎవరిని నియమించినా అభ్యంతరం లేదంటున్నారు. అయితే స్థానిక నాయకులు నాగుబండి రాంబాబు, పి.దుర్గాప్రసాద్‌లు మాత్రం భట్టి కోటాలో తమకు డీసీసీ పదవి వస్తుందనే ధీమాతో ఉన్నారు. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తన సోదరుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరును ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు కె.రంగారావు, పరుచూరి మురళి పేర్లూ వినిపిస్తున్నాయి. పొత్తుల్లో భాగంగా పినపాక అసెంబ్లీ స్థానాన్ని సీపీఐకి ఇవ్వాల్సి వస్తే ఎస్టీ కోటాలో రేగా కాంతారావు కూడా డీసీసీ అధ్యక్ష బరిలో ఉండనున్నారు. చాంతాడంత జాబితాతో పదవి ఎవరికివ్వాలో పీసీసీ నాయకత్వానికీ తలనొప్పిగా మారి పెండింగ్‌లో పడిపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు