యోగిపై పెరుగుతున్న అసమ్మతి!

4 Jun, 2018 03:24 IST|Sakshi

లక్నో: 2014తో పోలిస్తే యూపీలో బీజేపీకి క్షేత్రస్థాయిలో పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి. యోగి ఆదిత్యనాథ్‌ సీఎం అయ్యాక పార్టీకి మరింత ఊపు వస్తుందనుకున్నప్పటికీ.. ఆ పరిస్థితి కనిపించడం లేదు. గోరఖ్‌పూర్, ఫుల్పూర్, కైరానా (ఎంపీ స్థానాలు), నూర్పూర్‌ (అసెంబ్లీ) ఉప ఎన్నికల్లోనూ బీజేపీ ఓటమితో.. సొంత పార్టీలోనే అసమ్మతి రాజుకుంది. పదిహేను రోజుల క్రితం రాష్ట్రానికి చెందిన ఓ బీజేపీ ఎంపీ.. యోగి తీరుపై నేరుగా పార్టీ జాతీయాధ్యక్షుడికే ఫిర్యాదు చేశారు. తాజా ఫలితాలతో.. ఓ రాష్ట్ర మంత్రి, ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా యోగి నాయకత్వంపై తమ అసమ్మతి గళాన్ని వినిపిస్తున్నారు. ఈ అసమ్మతి, ప్రజల్లో అసంతృప్తి కొనసాగితే 2019లో బీజేపీ ఆశిస్తున్నన్ని సీట్లు రావడం కూడా కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

నేరుగా యోగిపైనే విమర్శలు
గోపామా ఎమ్మెల్యే శ్యామ్‌ ప్రకాశ్‌ ఏకంగా పార్టీ రాష్ట్ర నాయకత్వం (యోగి)పై వ్యంగ్యంగా కవితలు రాసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. బీజేపీ ప్రభుత్వం పారదర్శక పాలన అందించడంలో విఫలమైనందున ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజలను నేరుగా కలవలేక పోతున్నారని మరో ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ విమర్శించారు. మరోవైపు, యోగి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవడంలో విఫలమైందని.. తద్వారా ప్రజల్లో తమపై (ఎమ్మెల్యేలు, ఎంపీలు) ఒత్తిడి పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవినీతి నిర్మూలనలో విఫలమైనందునే వరుస ఓటములు ఎదురవుతున్నాయని.. ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన ఎస్‌బీఎస్‌పీ నేత, రాష్ట్ర మంత్రి ఓంప్రకాశ్‌ రాజ్‌భర్‌ కొంతకాలంగా విమర్శిస్తూనే ఉన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా