ఎన్నికలు లేనందువల్లేనా అంటున్నారు: బీజేపీ ఎమ్మెల్యే

2 Oct, 2019 16:56 IST|Sakshi

బెంగళూరు: బిహార్‌ వరదలపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్‌ కర్ణాటక రాజకీయ వర్గాల్లో అలజడి సృష్టించింది. బిహార్‌కు అండగా ఉంటామని చెప్పిన ప్రధాని.. కర్ణాటక గురించి కనీసం సోషల్‌ మీడియాలోనైనా ఎందుకు పూర్తిస్థాయిలో స్పందించడం లేదని ప్రతిపక్షంతో పాటు పలువురు బీజేపీ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక గురించి పట్టించుకోకపోతే దక్షిణ భారత్‌లో బీజేపీ పట్టు కోల్పోతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాల్‌ హెచ్చరించారు. 25 ఎంపీలను ఇచ్చిన కర్ణాటకను నిర్లక్ష్యం చేయడం తగదని హితవు పలికారు. బిహార్‌ రాష్ట్రం వరదలతో అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో సోమవారం నాటికి దాదాపు 29 మంది మరణించారు. ఈ విషయంపై స్పందించిన ప్రధాని మోదీ..‘ బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌తో మాట్లాడాను. వరద పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నాను. వివిధ ప్రభుత్వ శాఖలు వరద బాధితులను ఆదుకునే పనిలో నిమగ్నమయ్యాయి. సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది’ అని ట్వీట్‌ చేశారు. 

ఈ నేపథ్యంలో బసనగౌడ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ...‘ ఇది ప్రజల మనోభావాలకు, భావోద్వేగాలకు సంబంధించిన విషయం.. రాజకీయాలకు సంబంధించింది కానే కాదు. బిహార్‌ వరదలపై ఆరా తీసిన మోదీ.. కనీసం మనకోసం ట్వీట్‌ కూడా చేయలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలకు ఎలా ముఖం చూపించగలం. ఏం సమాధానం చెప్పగలం. కర్ణాటకలో ఎన్నికలు లేని కారణంగానే మోదీ రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఓ బీజేపీ ఎమ్మెల్యేగా వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. ముందు ప్రజలు తర్వాతే రాష్ట్రం, ఆ తర్వాతే పార్టీ. కర్ణాటకలో ప్రస్తుత పరిస్థితుల గురించి బీజేపీ ఎంపీలు ప్రధాని దృష్టికి తీసుకువెళ్లాలి. అలా జరగకపోతే బీజేపీ ఎమ్మెల్యేలం, ఎంపీలము అని చెప్పుకొంటే ప్రజలు మనల్ని చితక్కొడతారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేసుకుని రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించాలి అని సొంత పార్టీపై విమర్శలు గుప్పించారు. కాగా ఆగష్టులో భారీ వరదలు కర్ణాటకను ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సకాలంలో సహాయక చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారంటూ యడ్డీ సర్కారుపై విమర్శలు వెల్లువెత్తాయి.

>
మరిన్ని వార్తలు