కశ్మీర్‌పై పాక్‌కు సౌదీ షాక్‌..

2 Oct, 2019 16:47 IST|Sakshi

జెడ్డా : జమ్ము కశ్మీర్‌పై భారత్‌ వైఖరిని సౌదీ అరేబియా సమర్ధించడంతో పాకిస్తాన్‌ విస్మయానికి గురైంది. తన ప్రధాన మద్దతుదారుగా భావిస్తున్న సౌదీ అత్యంత కీలకమైన కశ్మీర్‌ వ్యవహారంలో భారత్‌ వెన్నంటి నిలవడం పాక్‌కు మింగుడుపడటం లేదు. సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ బుధవారం సమావేశమై జమ్ము కశ్మీర్‌ పరిణామాలను వివరించారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో జమ్ము కశ్మీర్‌కు సంబంధించి భారత్‌ ఇటీవల తీసుకున్న చర్యలు, అక్కడి పరిణామాలపై దోవల్‌ సౌదీ నేతకు క్షుణ్ణంగా వివరించారు. ఈ సమావేశంలో పలు ద్వైపాక్షిక అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. జమ్ము కశ్మీర్‌ వ్యవహారంలో భారత్‌ చేపట్టిన చర్యలపై ఈ సందర్భంగా సౌదీ నేత సంతృప్తి వ్యక్తం చేశారు. కశ్మీర్‌పై పాక్‌ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాటు కశ్మీర్‌ వ్యవహారం భారత అంతర్గత వ్యవహారంగా దోవల్‌ సౌదీ దృష్టికి తీసుకురాగలిగారు. భారత్‌తో జమ్ము కశ్మీర్‌ అంతర్భాగం కావడంతో పాటు అభివృద్ధిలో దేశంతో కలిసి నడిచేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దోహదపడుతుందని దోవల్‌ సౌదీ నేతకు వివరించారు.

మరిన్ని వార్తలు