భారీగా పెరిగిన చంద్రబాబు, లోకేష్‌ ఆస్తులు

22 Mar, 2019 19:28 IST|Sakshi

సాక్షి, చిత్తూరు : కుప్పం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు తరఫున స్థానిక టీడీపీ నేతలు శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఇందులో భాగంగా ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో చంద్రబాబు తన మొత్తం ఆస్తుల విలువ సుమారు 700 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. ఈ మొత్తం ఆస్తుల్లో స్థిర ఆస్తి విలువ రూ. 19 కోట్ల 96 లక్షలు, చరాస్తుల విలువ 47 లక్షల 38 వేల రూపాయలని తెలిపారు. ఇక తన సతీమణి నారా భువనేశ్వరి చరాస్తుల విలువ రూ. 574 కోట్లుగా పేర్కొన్న చంద్రబాబు.. స్థిరాస్తుల విలువ 95 కోట్ల రూపాయలని వెల్లడించారు. కాగా 2014 ఎన్నికల సందర్భంగా.. చంద్రబాబు తన ఆస్తి విలువను 176 కోట్ల రూపాయలుగా చూపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఐదేళ్లలో ఏకంగా ఆయన ఆస్తి విలువ 700 కోట్ల రూపాయలకు చేరడం గమనార్హం. మరోవైపు చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ ఆస్తులు కూడా భారీగానే పెరిగాయి.

మొత్తం ఆస్తి రూ. 375 కోట్లు..
సాక్షి, గుంటూరు : మంగళగిరి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా చంద్రబాబు తనయుడు, ఏపీ మంత్రి లోకేష్‌ కూడా శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తి విలువ సుమారు రూ. 375 కోట్ల రూపాయలుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇందులో చరాస్తుల విలువ 253 కోట్ల 68 లక్షల రూపాయలుగా పేర్కొన్న లోకేష్‌... స్థిరాస్తుల విలువ 66 కోట్ల 78 లక్షలని వెల్లడించారు. రాజకీయ నాయకుడిగా సమాజ సేవకు అంకితమైన తనకు కేవలం ఈ కారణంగా వచ్చే జీతభత్యాలే ఆదాయ వనరు అని పేర్కొన్నారు. ఇక తన సతీమణి నారా బ్రాహ్మణి వ్యాపారవేత్త అని పేర్కొన్న లోకేష్‌..ఆమె స్తిరాస్థుల విలువ రూ. 18.74 కోట్లని,  చరాస్తుల విలువ రూ. 14 కోట్ల 40 లక్షలు అని వెల్లడించారు. తన కుమారుడు దేవాన్ష్‌ స్థిరాస్తుల విలువ 16.17 కోట్ల రూపాయలు, చరాస్తుల విలువ రూ. 3.88 కోట్లని లోకేష్‌ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు