కశ్మీర్‌ ఎల్జీగా ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌!

10 Aug, 2019 10:46 IST|Sakshi

కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా రిటైర్డ్ ఐపీఎస్ విజయ్ కుమార్!

స్మగ్లర్ వీరప్పన్‌ను అంతమొందించిన విజయ్‌

ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా గుర్తింపు

సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ నియమకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది.  రాష్ట్రపతి భవన్‌ నుంచి అధికారిక ప్రకటన కోసం ప్రభుత్వం ఎదురు చూస్తోన్నట్లు సమాచారం. ఎన్‌కౌంటర్లు చేయడంలో స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందిన విజయ్‌ నియమానికి రాష్ట్రపతి కూడా సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు రేపోమాపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీంతో కశ్మీర్‌ తొలి ఎల్జీగా నియామకమైన అధికారిగా విజయ్‌ గుర్తింపు పొందనున్నారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్‌, లఢక్‌ కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ కేంద్రం తరఫున ప్రతినిధిగా లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు.

ప్రస్తుతం జమ్మూకశ్మీర్, లఢక్‌ వ్యవహారాలను గవర్నర్‌ సత్యపాల్ మాలిక్ చూస్తున్నారు. ఇప్పుడు రెండు ప్రాంతాలకు వేర్వేరుగా లెఫ్టినెంట్ గవర్నర్లను నియమించి.. అక్కడ పాలనను గాడినపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా రిటైర్డ్ ఐపీఎస్ విజయ్ కుమార్‌ను నియమించే అవకాశాలు ఉన్నట్టు ఢిల్లీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మరోవైపు ఆయన నియమకానికి సంబంధించి అధికారిక ప్రకటన రాకముందే సోషల్‌ మీడియాలో విజయ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుత్తున్నాయి.

ఎవరీ విజయ్!?
విజయ్ కుమార్ తమిళనాడుకు చెందిన 1975 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఈయనకు పెద్ద సక్సెస్‌ఫుల్ ట్రాక్ రికార్డే ఉంది. కర్ణాటక-తమిళనాడు ప్రభుత్వాలకు కంటిలో నలుసులో మారిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను 2004 అక్టోబర్‌లో అంతమొందించిన తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ చీఫ్‌గా వ్యవహరించారు. వీరప్పన్‌ను పట్టుకున్న తర్వాత విజయ్ పేరు ప్రపంచానికి తెలిసింది. అంతేకాదు చెన్నై పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో.. ఎంతోమంది నేరస్థులను ఎన్‌కౌంటర్ చేశారు. 2008లో హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ చీఫ్‌గా నియమితులయ్యారు. 2010నాటి దంతెవాడ ఘటన తర్వాత విజయ్ కుమార్ సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా 2010-2012 మధ్య కాలంలో మావోయిస్టుల ఏరివేత, అటు జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆటకట్టించడంలో కీలక పాత్ర పోషించారు. 2018లో కశ్మీర్ గవర్నర్‌కు భద్రతా వ్యవహారాల సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు. 

ట్రాక్ రికార్డ్!!
హైదరాబాద్‌ నగరంతో కూడా ఆయనకు మంచి సంబంధాలున్నాయి. గతంలో హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీకి అధిపతిగా పనిచేశారు. ఆ తర్వాత డీజీ, సీఆర్పీఎఫ్ డీజీగా పనిచేసి పదవీ విరమణ అయ్యారు. ఆ తర్వాత కూడా వామపక్ష తీవ్రవాద ప్రాంతాలకు హోం మంత్రిత్వ శాఖకు సీనియర్ సలహాదారుగా పనిచేశారు. ప్రస్తుతం, హోమ్, ఫారెస్ట్, ఎకాలజీ & ఎన్విరాన్మెంట్, హెల్త్ & మెడికల్ ఎడ్యుకేషన్, యూత్ సర్వీసెస్ & స్పోర్ట్స్, హాస్పిటాలిటీ & ప్రోటోకాల్, సివిల్ ఏవియేషన్, ఎస్టేట్స్, ఇన్ఫర్మేషన్ పోర్ట్‌ఫోలియోలతో జమ్ముకశ్మీర్ గవర్నర్‌కు సలహాదారుగా ఉన్నారు. అందుకే ఇంతటి రికార్డ్ ఉన్న విజయ్‌ను కశ్మీర్‌కు పంపితే సమర్థవంతంగా చూసుకుంటారని కేంద్రం భావిస్తోంది.
 
ఇదిలావుండగా..
తెలంగాణ గవర్నర్‌గా ఉన్న ఈఎస్ఎల్ నరసింహన్‌ను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా పంపుతారంటూ ప్రచారం కూడా జరిగిన విషయం తెలిసిందే. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు మిత్రుడు కావడంతో నరసింహన్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే, తాజాగా నరసింహన్‌ కాకుండా విజయ్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది.

మరిన్ని వార్తలు