తీస్‌మార్‌ ఖాన్‌ అయితే ఎందుకు ఓడిపోయాడు?

12 Mar, 2020 20:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జైల్లో కూర్చొని పీసీసీ పదవి ఎందుకు ఆశిస్తున్నారని రేవంత్‌ను ప్రశ్నించారు. నాలుగు గోడల మధ్య జరుగుతున్న చర్చను సోషల్‌ మీడియాలో ఎందుకు పెడుతున్నారని నిలదీశారు. రేవంత్‌రెడ్డి అనుచరులు ఫేస్‌బుక్‌లో చేస్తున్న వ్యాఖ్యలను గమనిస్తున్నానని చెప్పారు. రేవంత్‌ అనుచరులు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని.. వారి అరాచకాలను అడ్డుకోవాలని టీపీసీసీని కోరారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ.. తనకు ఫేస్‌బుక్‌ అనుచరులు లేరని తెలిపారు. తాము జనాల మధ్య ఉంటామని.. ఎవరో పైసలు పంపిస్తే లీడర్లు కాలేదని అన్నారు. కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్‌ గాంధీ ఫొటోలు పెట్టుకుని తాము ఎన్నికల్లో గెలిచామని గుర్తుచేశారు. కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్‌, సీఎం కావాలనే కోరిక చాలా మందికి ఉందన్నారు.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబులు కారు ఎక్కుతారని రేవంత్‌ అనుచరులు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదని హితవు పలికారు. తను టీఆర్‌ఎస్‌లో చేరాలంటే అడ్డుకునేది ఎవరని ప్రశ్నించారు. పీసీసీ కోర్‌ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 110 జీవోపై కొన్ని నిర్మాణాలు జరిగాయని గుర్తుచేశారు. కేటీఆర్‌, రేవంత్‌కు మధ్య పంచాయితీ ఉంటే వారిద్దరు చూసుకోవాలని.. కానీ తమపై బురద జల్లడం ఏమిటని ప్రశ్నించారు. రేవంత్‌ అనుచరులు చేసే న్యూసెన్స్‌ వల్ల చాలా ఇబ్బందలు పడుతున్నామని తెలిపారు. రేవంత్‌కు ఒక్కరికే అభిమానులు లేరని.. తనకు కూడా ఉన్నారని అన్నారు. పిలిస్తే సంగారెడ్డి నుంచి వేలాది మంది అనుచరులు వస్తారని స్పష్టం చేశారు. 

కాంగ్రెస్‌ పార్టీ అందరిదని.. అలాంటి పార్టీని రేవంత్‌ అనుచరులు బదనాం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నుంచి సీఎం ఎవరనేది సోనియా గాంధీ చెబుతారని అన్నారు. రేవంత్‌కు అంత దమ్ము ఉంటే.. టీడీపీలో ఉండి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఎందుకు పోరాటం చేయలేదని సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు కార్యకర్తల బలం ఎక్కువగా ఉందనే రేవంత్‌ తమ పార్టీలో చేరారని విమర్శించారు. రేవంత్‌ అనుచరులు న్యూసెన్స్‌ ఆపకపోతే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి తీస్‌మార్‌ ఖాన్‌ అయితే కొడంగల్‌లో ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. తనపై ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని పార్టీపై రుద్దలేదని చెప్పారు. తప్పులు చేసుడు ఎందుకు అరెస్ట్‌ అవ్వడం ఎందుకని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాస్‌పోర్ట్‌ కేసులో అరెస్ట్‌ అయినప్పుడు తను చాలా బాధపడ్డానని.. అమీన్‌పూర్‌ అసైన్డ్‌ భూముల విషయంలో ఎప్పుడు అరెస్ట్‌ చేస్తారో తెలియదని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను ఓడగొట్టాలని పార్టీ సీనియర్లు చూస్తుంటే.. రేవంత్‌ అనుచరులు పార్టీ పరువు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు