పులుల్ని వేటాడేవాళ్లం.. టైగర్‌ అభీ జిందాహై!!

3 Jul, 2020 21:28 IST|Sakshi

విమర్శలను తిప్పికొట్టిన జ్యోతిరాదిత్య సింధియా

భోపాల్‌: బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా, కాంగ్రెస్‌ నేతలు కమల్‌నాథ్‌, దిగ్విజయ్‌ సింగ్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మధ్యప్రదేశ్‌ కొత్త కేబినెట్‌లో తన అనుచరులకు సముచిత స్థానం లభించిన నేపథ్యంలో.. ‘టైగర్‌ అభీ జిందా హై’ అంటూ జ్యోతిరాదిత్య గురువారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అదే విధంగా గత కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం కమల్‌నాథ్‌, దిగ్విజయ్‌ సింగ్‌ వాగ్గాదానాలు మరిచిన విషయం ప్రజలకు తెలుసునంటూ మండిపడ్డారు. ఈ క్రమంలో జ్యోతిరాదిత్య వ్యాఖ్యలను తిప్పికొడుతూ ‘‘ఏ పులి బతికి ఉంది’’ అని కమల్‌నాథ్‌ ఎద్దేవా చేయగా.. ‘‘నిజమైన పులి వ్యక్తిత్వం ఏంటో తెలుసా’’ అంటూ డిగ్గీరాజా ట్విటర్‌ వేదికగా స్పందించారు. (టైగర్‌ అభీ జిందా హై: జ్యోతిరాదిత్య)

‘‘వేటపై నిషేధం లేని సమయంలో నేను, మాధవరావు సింధియా(జ్యోతిరాదిత్య తండ్రి) పులులను వేటాడేవాళ్లం. అయితే మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వన్యప్రాణి సంరక్షణ చట్టం తీసుకువచ్చిన తర్వాత నుంచి కేవలం కెమెరాలో షూట్‌ చేస్తున్నా. నిజమైన పులి క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో తెలుసు కదా. అడవిలో అదొక్కటే ఉంటుంది’’ అంటూ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఇక ఈ ఇద్దరు నేతల వ్యంగ్యాస్త్రాలకు జ్యోతిరాదిత్య శుక్రవారం ధీటుగా బదులిచ్చారు.(‘ఏ పులి బతికుంది పేపర్‌ మీదా? సర్కస్‌ లోనా?’)

బీజేపీ వర్చువల్‌ ర్యాలీలో మాట్లాడిన ఆయన.. ‘‘నా చుట్టూ ఎన్నో గద్దలు తిరుగుతూ ఉంటాయి. దాడి చేస్తూ ఉంటాయి. మాంసం ఉన్న వాళ్ల చుట్టే పక్షులు ఆహారం కోసం తిరుగుతాయి. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కమల్‌నాథ్‌, దిగ్విజయ సింగ్‌కు మరోసారి గుర్తు చేస్తున్నా. టైగర్‌ అభీ జిందాహై’’ అంటూ విమర్శలు తిప్పికొట్టారు. కాగా సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగిన సింధియా.. మార్చిలో కమల్‌నాథ్‌తో విభేదాలు తలెత్తిన క్రమంలో.. 22 ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టారు. ఇక ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో జ్యోతిరాదిత్య బీజేపీ తరఫున ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే. 

>
మరిన్ని వార్తలు