లెంపలేసుకుని నిజాలు వెల్లడిస్తారా?: కన్నా

3 Oct, 2018 11:48 IST|Sakshi
కన్నాలక్ష్మీ నారాయణ

సాక్షి, గుంటూరు: బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ 14వ సారి ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరో ఐదు ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు చంద్రబాబుకు కన్నా బహిరంగ లేఖను రాశారు. నాలుగేళ్ల పాలనలో వైఫల్యాలు, అవినీతిపై  కన్నా ప్రతి వారం ఐదు ప్రశ్నలతో సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా తాజాగా సంధించిన మరో ఐదు ప్రశ్నలు ఇవే...

ప్రశ్న నెంబర్‌ 66: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో ద్రోహం చేసిందని, నిధులు ఇవ్వటం లేదని దొంగ ధర్మపోరాట దీక్షలు, సమావేశాలు పెట్టి గగ్గోలు పెడుతున్నారు. కేంద్రం నుంచి ఎక్కువ నిధులు వచ్చాయని స్వయానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌ కుమారే చెప్పారు. 2017-18 ఆర్ధిక సంవత్సరానికి కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రూ.9700 కోట్లు లక్ష్యంగా నిర్దేశించుకోగా, రూ.17,500 కోట్ల నిధులు గ్రాంట్ల రూపంలో వచ్చాయని చెప్పారు. 2018-19 ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి అంటే 6 మాసాలకే రూ.10,372 కోట్ల గ్రాంట్‌ వచ్చిందని కూడా చెప్పారు. ఈ ప్రకటనతో మీరు చేస్తున్న ఆరోపణలు, దొంగ దీక్షలు అన్ని మోసపూరితమని అంగీకరిస్తారా? చెంపలు వేసుకుని ప్రజలకు నిజాలను వెల్లడిస్తారా?

ప్రశ్న నెంబర్‌ 67: రాష్ర్టంలో అన్ని జిల్లాల్లో మట్టి, ఇసుక, గనులు, దేనినీ వదలకుండా మీ కుమారుడి కనుసన్నలలో కబ్జాలు అయిపోతున్నాయి. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట నుంచి కాకరపల్లి వరకు సముద్రతీరాన ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉప్పు శాఖ వారి వేలాది ఎకరాలను టీడీపీ నాయకులు కబ్జా చేసిన మాట వాస్తవం కాదా? దీనిపై సీబీఐ విచారణకు సిద్ధమా?

ప్రశ్న నెంబర్‌ 68: ప్రచార ఆర్భాటంలో, ప్రజలను మభ్యపెట్టడంలో, మాయ చేయడంలో మీరు మీ కుమారులు ఒకరిని మించినవారొకరు అయిపోయారు. సెప్టెంబర్‌ 18 నుంచి 20 వరకు చైనాలో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం వార్షిక సమావేశంలో ప్రసంగించేందుకు మీ కుమారుడికి ప్రత్యేక ఆహ్వానం అందిందని ఎంతో హడావిడి చేశారు. మరయితే ఇందుకు అయిన ఖర్చు అంతా రాష్ట్రమే ఎందుకు భరించవలసి వచ్చిందో చెప్పగలరా? అదీ చాలా తెలివిగా ముందు ఏపీ  ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఏజెన్సీకి 6-7-2018న జీ.ఓ.ఎంఎస్‌ నెంబర్‌ 64 ద్వారా 18 కోట్ల రూపాయలు కేటాయించి, మళ్లీ ఆ సంస్థ ద్వారా చైనా ఖర్చులకి 6-9-2018న జీ.ఓ.ఎంఎస్‌ 1947 ద్వారా భరించిన మాట వాస్తవం కాదా? పెట్టుబడుల ప్రమోషన్లకా లేక మీ కుమారుని ప్రమోషన్‌కా ఈ ఖర్చు అయింది? అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని మీ ఇద్దరి దుబారా ఆర్భాటపు ఖర్చులతో ఇంకా అప్పుల ఊబిలోకి నెట్టడం లేదా?

ప్రశ్న నెంబర్‌ 69: పులిచింతల కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చేందుకు విజయవాడలో స్వరాజ్‌ మైదానాన్ని మీకు కావలసిన బొల్లినేని శీనయ్య కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగా కోర్టులో సవాల్‌ చేయని విషయం వాస్తవం కాదా? పులిచింతల కాంట్రాక్టర్‌ తాను రూ.199 కోట్ల మేర అదనపు పనులు చేశానని, అందుకు తనకు చెల్లింపులు చేయాలని కోర్టుకి ఎక్కితే రాష్ట్ర ప్రభుత్వం కావాలని సకాలంలో అఫిడవిట్‌ దాఖలు చేయకపోవడం వల్ల ఆ కాంట్రాక్టర్‌కు చెల్లించవలసిన మొత్తం రూ.400 కోట్లకు చేరిన మాట వాస్తవం కాదా? ఆ మొత్తం సకాలంలో చెల్లించనందున విజయవాడలోని స్వరాజ్‌ మైదానం, పులిచింతల కోసం సేకరించిన 48 ఎకరాల భూమిని వేలం వేసి ఆ కాంట్రాక్టరుకు ఆ సొమ్ము చెల్లించాలని మచిలీపట్టణం కోర్టు ఆదేశాలను జారీ చేయలేదా? ఈ మొత్తం కుంభకోణం మీ కనుసన్నలలో జరగలేదా?

ప్రశ్న నెంబర్‌ 70: అమెరికాలో ప్రకృతి వ్యవసాయం మీద ప్రత్యే ప్రసంగంగా చెప్పబడుతున్న మీ ప్రసంగంలో రాష్ట్రంలో 5 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు సెలవిచ్చారు. స్వయానా వ్యవసాయశాఖ మంత్రి అసెంబ్లీలో 2018-19 వ్యవసాయ బడ్జెట్‌పై ప్రసంగిస్తూ ఇప్పటివరకూ 1.63 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. ఎవరిది నిజం? ఎవరిది అబద్దం? ప్రజలకు వివరిస్తారా?

మరిన్ని వార్తలు