విశ్వాస పరీక్షపై కర్ణాటక అసెంబ్లీలో చర్చ

18 Jul, 2019 11:06 IST|Sakshi

సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీలో విశ్వాసపరీక్షపై చర్చ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కుమారస్వామి గురువారం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం కుమారస్వామి ఉద్వేగభరితంగా మాట్లాడారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నుతున్నది ఎవరో సభలో చెప్పాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. పరోక్షంగా బీజేపీని వేలెత్తి చూపుతూ.. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కుట్ర గురించి ఈ సభలో చర్చించాల్సిన అవసరముందని, సంకీర్ణ ప్రభుత్వం మనుగడ సాధించినా.. సాధించకపోయినా ప్రస్తుతం విధానసభ జరిగిన తీరు  తప్పకుండా పార్లమెంటరీ చరిత్రలో నిలిచిపోవాలని అన్నారు. ఇక బీజేపీ నేత యడ్యూరప్ప మాట్లాడుతూ ఒకే రోజులో విశ్వాసపరీక్షపై చర్చ పూర్తిచేసి.. బలపరీక్ష నిర్వహించాలని స్పీకర్‌ను అభ్యర్థించారు. అయితే, రెబెల్‌ ఎమ్మెల్యేలు ఎంతమంది సభ్యకు హాజరయ్యారనేది ఇంకా స్పష్టత రాలేదు. 

ఇక, మరోవైపు విశ్వాస పరీక్షలో విజయం తమదేనంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప మరోసారి విశ్వాసం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వద్ద గురువారం ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడారు. సంకీర్ణ కూటమికి వంద కన్నా తక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నారని పేర్కొన్నారు. ‘మేం 101శాతం కాన్ఫిడెన్స్‌తో ఉన్నాం. వారికి వంద కన్నా తక్కువ మంది మద్దతు ఉంది. మాకు 105మంది మద్దతు ఉంది. సర్కార్‌ పెట్టిన విశ్వాస పరీక్ష వీగిపోతుంది’ అని స్పష్టం చేశారు.

బలాబలాలివి..!
అధికార కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ కూటమికి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో కుమారస్వామి ప్రభుత్వం కొనసాగడంపై నీలినీడలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. మొత్తం 225 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో అధికార కూటమికి 117 ఎమ్మెల్యేల బలం ఉంది. బీజేపీకి 105 మంది సభ్యులు ఉండగా, ఇటీవల ఇద్దరు స్వతంత్రులు మద్దతు ప్రకటించడంతో అది 107కు చేరుకుంది.

ప్రస్తుతం రామలింగారెడ్డిని మినహాయించి 15 మంది రెబెల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించినా లేక వారు గైర్హాజరైనా అసెంబ్లీలో అధికార కూటమి బలం 102కి పడిపోనుంది. రాజీనామాల ఆమోదంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య 106కు చేరుకుంటుంది. ఈ పరిస్థితుల్లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో కొనసాగడం కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ 107 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని వార్తలు