ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమే వారి పని: కర్నె

14 Oct, 2017 02:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం తలపెట్టినా వ్యతిరేకించడం, విమర్శించడం విపక్షాలకు అలవాటుగా మారిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ మండిపడ్డారు. ఏడాది కిందట కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినపుడు కూడా కాంగ్రెస్‌ వ్యతిరేకించిందని, దానిని మిగతా విపక్షాలు అనుసరించాయని విమర్శించారు.

టీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలు ఏర్పాటు చేసిన ఏడాది లోపే కొత్త భవనాలకు శంకుస్థాపన చేయడం సీఎం కేసీఆర్‌ పట్టుదలకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ దీన్ని జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు.

మంత్రి హారీశ్‌ ముచ్చర్ల ఫార్మా సిటీకి అందరికంటే ముందుగా తన భూమిని సేకరణకు ఇచ్చి సహకరించారని, కాంగ్రెస్‌ హయాంలో ప్రస్తుత మంత్రి ఈటల రాజేందర్‌ 8 ఎకరాల భూమిని ఔటర్‌ రింగ్‌ రోడ్డు కోసం లాక్కుని కాంగ్రెస్‌ నేతలు రాక్షసానందం పొందారని విమర్శించారు. కాంగ్రెస్‌ నేతలు సరైన కారణాలు చెప్పకుండా వ్యతిరేకించడం సరికాదని హితవు పలికారు.  

మరిన్ని వార్తలు