ఏఎస్‌ఐ భార్య అనుమానాస్పద మృతి | Sakshi
Sakshi News home page

ఏఎస్‌ఐ భార్య అనుమానాస్పద మృతి

Published Sat, Oct 14 2017 2:12 AM

 mysterious death of the wife of ASI - Sakshi

అనంతపురం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఏఎస్‌ఐ దేవదాస్‌ భార్య సరళ (48) శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతోనే తన బావే హత్య చేసి ఉంటాడని మృతురాలి చెల్లెలు ఆరోపించింది. అనారోగ్యంతోనే ఆమె మృతి చెందిందని భర్త చెబుతున్నాడు.

అనంతపురం సెంట్రల్‌: నగరంలోని కళ్యాణదుర్గం బైపాస్‌రోడ్డు భాగ్యనగర్‌ కాలనీలో ఏఎస్‌ఐ దేవదాసు, సరళ దంపతులు నివాసముంటున్నారు. వీరికి కీర్తి, హరితారాణి, మనోహర్‌లు సంతానం. పెద్ద కుమార్తె బీటెక్‌ చదువుతుండగా, మిగతా ఇద్దరూ ఇంటర్‌ చదువుతున్నారు. సరళకు అన్నదమ్ములు లేకపోవడంతో తండ్రి నుంచి రూ.కోట్లు విలువజేసే ఆస్తులు వచ్చాయి. తొలినాళ్లలో అన్యోన్యంగా సాగిన వీరి సంసారంలో కొన్నేళ్ల నుంచి కలహాలు ప్రారంభమయ్యాయి. దేవదాసు భార్యను వేధించడం మొదలు పెట్టాడు. అనేకసార్లు ఆమె తన చెల్లెలుకు చెప్పుకొని బాధపడింది. దీనిపై గతంలో డీఎస్పీ మల్లికార్జునవర్మకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో సరళ మృతి చెందింది.

గుట్టుగా ఖననానికి ఏర్పాట్లు!
బంధువులకు సమాచారం ఇవ్వకుండా గుట్టుగా ఖననం చేయడానికి దేవదాసు యత్నించడం అనుమానాలకు దారితీసింది. విషయం తెలుసుకున్న మృతిరాలి చెల్లెలు వారి ఇంటికి వచ్చి గొడవకు దిగింది. తన అక్కను బావే హింసించి చంపారంటూ ఆరోపించింది. మృతురాలి బంధువులను పక్కకు తోసేసి ఖననం చేయడానికి ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టూటౌన్‌ పోలీసులు రంగప్రవేశం చేసి గొడవ సద్దుమణిగించి అంత్యక్రియలు పూర్తి చేసేందుకు యత్నించారు. అయితే మృతురాలి బంధువులు మాత్రం తమ అనుమానాలను నివృత్తి చేయాలని పట్టుపట్టారు. చేసేదిలేక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్లు టూటౌన్‌ పోలీసులు తెలిపారు.

వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకోవాలనే..
ఏఎస్‌ఐ దేవదాసు మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, తనకు అడ్డుగా ఉందనే కారణంతో తమ అక్క సరళను హింసించి హత్య చేశాడని మృతురాలి చెల్లెళ్లు కమల, వర్ణ, అనితలు ఆరోపించారు. అక్క మృతి చెందితే మరో వివాహం చేసుకోవాలని కుట్ర పన్నాడన్నారు. అనేక సార్లు హింసించాడని, దీనిపై గతంలో పనిచేసిన డీఎస్పీ మల్లికార్జునవర్మకు ఫిర్యాదు కూడా చేశామని వివరించారు. అయితే వారు దుప్పటి పంచాయితీ చేసి పంపించారని ఆరోపించారు. దేవదాసు, ఆయన అన్న ఇద్దరూ ఏఎస్‌ఐలు అని, కేసును తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. తన తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తులతో పాటు దేవదాస్‌ ఆస్తులు కూడా పిల్లల పేర్లతో రిజిస్ట్రేషన్‌ చేయించాలని డిమాండ్‌ చేశారు.

అనారోగ్యంతోనే చనిపోయింది..
ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ సరళ మృతి చెందింద భర్త దేవదాసు తెలిపారు. గురువారం రాత్రి పరిస్థితి విషమించడంతో స్థానికంగా ఉన్న ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లామని, వ్యాధిని పరిశీలించిన అనంతరం అడ్మిషన్‌ చేసుకోలేదని వివరించారు. పరిస్థితి విషమించి ప్రాణం విడిచిందని చెప్పారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement