కుమారస్వామికి కేసీఆర్‌ అభినందనలు 

23 May, 2018 01:01 IST|Sakshi
మంగళవారం బెంగళూరులో కుమారస్వామికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో దేవెగౌడ

ప్రమాణ స్వీకారానికి ఒకరోజు ముందే బెంగళూరుకు వెళ్లిన ముఖ్యమంత్రి

నేటి కార్యక్రమంలో కాంగ్రెస్‌తో వేదిక పంచుకోవడం ఇష్టం లేకే

రాత్రికే హైదరాబాద్‌ చేరుకున్న సీఎం బృందం  

సాక్షి, హైదరాబాద్‌/బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్న కుమారస్వామిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా కలసి అభినం దనలు తెలిపారు. హైదరాబాద్‌లో బుధవారం అత్యవసర సమావేశాలు ఉన్నందున ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఒకరోజు ముందుగానే మంగళవారం బెంగళూరు వెళ్లి ఆయన్ను కలిశారు. తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా కేసీఆర్‌ను ఆయన ఆహ్వానించడం తెలిసిందే. మంగళవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్‌ బెంగ ళూరు వెళ్లారు.

సీఎంతోపాటు స్పీకర్‌ ఎస్‌.మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు సి.లక్ష్మారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు కె.కేశవరావు, జోగినపల్లి సంతోష్‌ కుమార్, బి.వినోద్‌ కుమార్, మిషన్‌ భగీరథ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి, టీఎస్‌ఎండీసీ చైర్మన్‌ శేరి సుభాష్‌రెడ్డి తదితరులు సీఎం వెంట వెళ్లారు. బెంగళూరుకు వెళ్లగానే కేసీఆర్‌ నేరుగా మాజీ ప్రధాని దేవెగౌడ నివాసానికి చేరు కున్నారు. అక్కడే కుమారస్వామిని కలసి అభినందించారు. దేవెగౌడ, కుమారస్వామికి పుష్పగుచ్ఛం అందజేశారు. కుమారస్వామిని శాలువాతో సత్కరించారు. మంత్రులు, ఎంపీలను వారికి పరిచయం చేశారు. అనంతరం గంటకుపైగా ఇరుపక్షాల నేతల మధ్య చర్చలు జరిగాయి.  అనంతరం మంగళవారం రాత్రికే హైదరాబాద్‌కు సీఎం బృందం తిరుగు పయనమైంది.

అందుకే ముందుగా..
బెంగళూరులో బుధవారం జరిగే కుమార స్వా మి ప్రమాణస్వీకార కార్యక్రమంలో కాం గ్రెస్‌తో వేదిక పంచుకోవడానికి ఇష్టం లేకనే సీఎం కేసీఆర్‌ ఒకరోజు ముందుగా వెళ్లి వచ్చి నట్టుగా పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్‌ ఫ్రంట్‌ను ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఇలాంటి ఎత్తుగడ అనుసరించినట్టుగా భావిస్తున్నారు. ప్రాంతీయ పార్టీల కూటమిని ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేస్తున్న ప్రస్తుత సమయంలో కాంగ్రెస్‌తో కలసి వేదికను పంచుకోవడం తప్పుడు సంకేతాలు ఇస్తుందన్న అంచనా తోనే ఈ మార్గాన్ని అనుసరించారని పార్టీ వర్గాలు వెల్లడించాయి

మరిన్ని వార్తలు