ఉత్పత్తే లేదు.. మిగులెక్కడిది?

4 Jan, 2018 04:12 IST|Sakshi
బుధవారం గాంధీభవన్‌లో విద్యుత్‌ అంశంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను తిలకిస్తున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి. చిత్రంలో వీహెచ్, షబ్బీర్, సుదర్శన్‌రెడ్డి తదితరులు

కరెంట్‌పై కేసీఆర్‌ చెబుతున్నవన్నీ అబద్ధాలే: ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మిగులు విద్యుత్, ప్రస్తుతం సాగుకు ఇస్తున్న 24 గంటల కరెంట్‌ సరఫరా కాంగ్రెస్‌ ప్రభుత్వాల కృషి ఫలితమేనని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత చేపట్టిన విద్యుత్‌ ప్రాజెక్టుల్లో ఒక్క యూనిట్‌ విద్యుత్‌ అయినా ఉత్పత్తి చేశారా అని సీఎం కేసీఆర్‌ను నిలదీశారు. ఒక్క యూనిట్‌ కూడా ఉత్పత్తి చేయకుండానే మిగులు విద్యుత్‌ ఎలా సాధించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక ప్రారంభించిన యాదాద్రి, భద్రాద్రి విద్యుత్‌ ప్రాజెక్టుల్లో నేటికీ పనులు కూడా ప్రారంభం కాలేదన్నారు. విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందాల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని దుయ్యబట్టారు. బుధవారం గాంధీభవన్‌లో విద్యుత్‌ అంశంపై టీపీసీసీ ఆధ్వర్యంలో విద్యుత్‌ అంశంపై ఏర్పాటు చేసిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో ఉత్తమ్‌ మాట్లాడారు.

ఇందులో శాసన మండలిలో విపక్ష నేత షబ్బీర్‌ అలీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్‌కుమార్‌ విద్యుత్‌ పరిస్థితిపై సమగ్ర సమాచారమిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో ప్రైవేట్‌ విద్యుత్‌ కొనుగోళ్ల ద్వారా కోట్లు దండుకునేందుకే జెన్‌కోను నిర్వీర్యం చేశారు. దీనివల్ల జెన్‌కో రూ. 13 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తూ 85 శాతం విద్యుత్‌ ఉత్పత్తి చేసిన జెన్‌కో.. ఇప్పుడు 69 శాతం ఉత్పత్తికే పరిమితమైంది. తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలోనే భూపాలపల్లి ఫేజ్‌–1, ఫేజ్‌–2, కొత్తగూడెం, జూరాల, పులిచింతలలో విద్యుత్‌ ఉత్పత్తికి కావాల్సిన చర్యలు తీసుకున్నాం. కేసీఆర్‌ ప్రజలను మోసం చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి కొనుగోలు చేస్తున్న విద్యుత్, ఇతర సంస్థల నుంచి కొనుగోలు చేసిన విద్యుత్‌ను ఇక్కడి ఉత్పత్తి సామర్థ్యంలో కలిపి చూపిస్తున్నారు’’అని విమర్శించారు.
14 వేల మెగావాట్లకు

ఎలా చేరింది..
రాష్ట్రంలో 6,500 మెగావాట్ల విద్యు త్‌ ఉత్పత్తి సామర్థ్యం 14 వేల మెగావాట్లకు ఎలా చేరిందని మండలిలో విపక్ష నేత షబ్బీర్‌ అలీ ప్రశ్నించారు. వచ్చే ఏడా ది నాటికి 28 వేల మెగావాట్లకు ఎలా చేరుకుంటుందో సీఎం ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్‌లో ప్రజలపై కరెంట్‌ భారం పడబోతోందని హెచ్చరించారు. ఛత్తీస్‌గఢ్‌తో లోపభూయిష్ట ఒప్పందం కుదుర్చుకున్నారని, బహిరంగ మార్కెట్‌లో యూనిట్‌ ధర రూ.3.50 నుంచి రూ.4 ఉంటే.. ప్రభు త్వం రూ.6 చెల్లిస్తోందని, దీంతో ప్రజలపై ఏటా 1,200 కోట్ల భారం పడుతుం దని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్‌ అన్నారు. కార్యక్రమంలో పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రేవంత్, దామోదర్‌రెడ్డి, వీహెచ్, పొన్నం, మల్లు రవి, సుదర్శన్‌ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోదంరెడ్డి, బండ కార్తీక తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు