నేడు ప్రధానితో సీఎం భేటీ

15 Jun, 2018 01:03 IST|Sakshi

కొత్త జోన్లు, రిజర్వేషన్లు, రాష్ట్ర విభజన అంశాలే ప్రధానం

 భేటీపై జాతీయ రాజకీయ వర్గాల్లో ఆసక్తి 

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కొత్త జోన్లకు ఆమోద ముద్ర, రిజర్వేషన్ల పెంపు బిల్లు ప్రధాన ఎజెండాగా శుక్రవారం మధ్యాహ్నం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భేటీ కానున్నారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు, రైతులకు ఉచిత జీవిత బీమా, తెలంగాణ కంటివెలుగు తదితర పథకాల వివరాలను ప్రధానికి వివరించనున్నారు. మొత్తంగా 68 అంశాలపై విజ్ఞప్తులు చేయనున్నట్టు తెలిసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ఆయన వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ఎంపీ సంతోష్‌కుమార్‌ ఉన్నారు. నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 12.30కు ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్‌ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ రాష్ట్రానికి సంబంధిం చిన పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. 

రిజర్వేషన్లు, జోన్లే ప్రధానం.. 
రాష్ట్రంలో విద్య, ఉపాధి అంశాల్లో ఎస్టీలు, ముస్లింలకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ రాష్ట్రం ఆమోదించి పంపించిన బిల్లు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. రిజర్వేషన్ల కోటా పెంపునకు వెసులుబాటు కల్పించాలని, దీనిని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. మరోవైపు కొత్త జోనల్‌ వ్యవస్థకు రాష్ట్ర మంత్రివర్గం గత నెలలోనే ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఏడు జోన్ల ఏర్పాటుకు వీలుగా రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించాలని ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. గత నెలలో ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్‌ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలసి ఈ విషయాన్ని నివేదించారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు, కొత్త జోన్లపై సహకరించాలని ప్రధానిని కేసీఆర్‌ కోరనున్నారు. 

68 అంశాలతో వినతిపత్రం 
పంటలకు కనీస మద్దతు ధరల పెంపు, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, రాష్ట్ర విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలు తదితర 68 అంశాలకు సంబంధించి ప్రధానికి సీఎం కేసీఆర్‌ వినతి పత్రం సమర్పించే అవకాశముంది. ఇక రైతులకు ఎకరానికి రూ.8 వేల చొప్పున పెట్టుబడి సాయంగా పంపిణీ చేసే ‘రైతు బంధు’పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే అమల్లోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా రైతులందరినీ ఆకట్టుకున్న ఈ పథకం ప్రధాని దృష్టిని కూడా ఆకర్షించింది. ఈ నేపథ్యంలో రైతు బంధు పథకం విజయవంతంగా అమలు చేసిన విధానాన్ని ప్రధానికి సీఎం వివరించనున్నారు. 

జాతీయ స్థాయిలో ఆసక్తి.. 
దేశంలో గుణాత్మక మార్పు, రాష్ట్రాలకు మరిన్ని అధికారాలే లక్ష్యంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో జాతీయ రాజకీయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ఆయన.. పలు ప్రాంతీయ పార్టీల నేతలతోనూ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీతో కేసీఆర్‌ భేటీ దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఎన్‌డీయే ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లనుందన్న ప్రచారం కూడా ఈ సమావేశానికి ప్రాధాన్యతను పెంచింది. 

మరిన్ని వార్తలు