సీఏఏపై సుప్రీం కోర్టు ఎలా విచారిస్తుంది?

16 Jan, 2020 13:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం గత డిసెంబర్‌ నెలలో తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను కేరళ మంగళవారం నాడు సుప్రీం కోర్టులో సవాల్‌ చేసిన విషయం తెల్సిందే. దీనిపై ఇంతవరకు సవాల్‌ చే సిన తొలి రాష్ట్రం కేరళనే. భారత రాజ్యాంగంలోని లౌకికవాదం. రాజ్యాంగంలోని 14వ అధికరణం కల్పిస్తోన్న పౌరుల ప్రాథమిక హక్కులకు ఈ చట్టం విరుద్ధంగా ఉందంటూ సివిల్‌ సూట్‌లో కేరళ సవాల్‌ చేసింది. కేంద్ర, రాష్ట్రాలు లేదా రాష్ట్రాల మధ్య తలెత్తేవివాదాలకు సంబంధించిన భారత రాజ్యాంగంలోని 131వ అధికరణం కింద కేరళ ఈ సూట్‌ను దాఖలు చేసింది.

ఇదే నిబంధన కింద సుప్రీం కోర్టు కేరళ పిటిషన్‌ను విచారిస్తుందా, లేదా? అన్నది కూడా సందేహమే. ఎందుకంటే ఈ నిబంధనకు సుప్రీం కోర్టులోని పలు బెంచీలు, పలు రకాలుగా ఇప్పటికే భాష్యం చెప్పాయి. కనుక స్పష్టత లేదు. లేదా సీఏఏను సవాల్‌ చేస్తూ వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు దాఖలు చేసిన 60 పిటిషన్లతోని కలిపి విచారించాలి. వారంతా రాజ్యాంగంలోని 32వ అధికరణ కింద పిటిషన్లు దాఖలు చేశారు. హక్కులకు భంగం కలిగినప్పుడు వాటి పునరుద్ధరణ కోరేందుకు ఈ అధికరణ  బాధితులకు వీలు కల్పిస్తోంది. 131వ అధికరణం కింద సూట్‌ దాఖలు చేసినట్లయితే దిగువ కోర్టులు, హైకోర్టులతో పని లేకుండా అది నేరుగా సుప్రీం కోర్టు విచారణకు వస్తుంది. ఇక్కడ 32వ అధికరణ కింద సవాల్‌ చేస్తే రిట్‌ పరిధిలోకి, అంటే దాని విచారణ రిట్‌ ప్రక్రియలో జరుగుతుంది. అదే 131వ అధికరణం కింద దాఖలు చేస్తే అది సివిల్‌ సూట్‌ పరిధిలోకి వచ్చి సూట్‌ ప్రక్రియలో విచారణ కొనసాగుతుంది. 32 కింద దాఖలైన పిటిషన్లను ఎలాంటి విచారణ లేకుండా కొట్టివేసే అధికారం సుప్రీం కోర్టుకు ఉందని, అదే 131వ అధికరణ కింద దాఖలైన సూట్‌ను కుదించవచ్చుగానీ విచారించకుండా కొట్టివేయడాఇకి వీలు లేదని మద్రాస్‌ హైకోర్టు మాజీ జడ్జీ కే. చంద్రు తెలిపారు.

పైగా131వ కింద విచారించినట్లయితే సాక్ష్యాధారాలను కూడా పూర్తి స్థాయిలో పరిశీలించాల్సి ఉంటుంది. ఈ రెండు నిబంధనలకు ఇంత తేడా ఉంది కనుక ఏ నిబంధన కింద సుప్రీం కోర్టు విచారణ చేపడుతుందన్నది ఇప్పుడు చర్చనీయాంశం. గతంలో ఈ నిబంధనకు సంబంధించి భిన్నమైన తీర్పులు వెలువడిన నేపథ్యంలోనే సందేహం తలెత్తుతోంది. కేంద్ర, రాష్ట్రాల మధ్య విభేదాలకు దారితీసిన అంశం వల్ల రాష్ట్రానికే నష్టం వాటిల్లే అవకాశం ఉన్నప్పుడు 131వ అధికరణ కింద ఆ వివాదాన్ని విచారించాల్సి ఉంటుందని 1977లో ఐదుగురు సభ్యులు గల సుప్రీం ధర్మాసనం తీర్పు చెప్పింది. కానీ 2015లో జార్ఖండ్, బీహార్‌ రాష్ట్రాల మధ్య ఏర్పడిన ఓ వివాదానికి సంబంధించి 131వ అధికరణం గురించి భిన్నంగా సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. 131వ అధికరణం కిందనే కేరళ సూట్‌ను సుప్రీం కోర్టు విచారించినట్లయితేనే సముచిత న్యాయం జరిగే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా