కీ సెగ్మెంట్స్‌: వడోదర, ఫిలిబిత్‌, బరామతి, పట్నా

16 Mar, 2019 12:32 IST|Sakshi

కాషాయ కోట


గుజరాత్‌లోని లోక్‌సభ నియోజకవర్గమిది. ఇంతకు పూర్వం దీనిని బరోడాగా పిలిచేవారు. 2009 నుంచి వడోదర అని పిలుస్తున్నారు. బరోడా మహారాజు ఫతేసింగ్‌రావ్‌ గైక్వాడ్‌ ఈ నియోజకవర్గం మొట్టమొదటి ఎంపీ. 2009లో ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. బరోడా రాజ వంశానికి చెందిన ముగ్గురు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 1991 ఎన్నికల్లో టీవీ రామాయణంలో సీతగా నటించిన దీపికా చిఖాలియా బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ప్రధాని నరేంద్ర మోదీ  2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి మధుసూదన్‌ మిస్త్రీపై 5,70,128 ఓట్ల రికార్డు మెజారిటీతో గెలిచారు. అయితే, ఆ ఎన్నికల్లో మోదీ వారణాసి నుంచి కూడా పోటీ చేసి గెలిచారు. దాంతో వడోదరను వదిలేసుకున్నారు. ప్రస్తుతం బీజేపీ నేత రంజన్‌బెన్‌ ధనంజయ్‌ భట్‌ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1998 నుంచి ఇంత వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఇక్కడ బీజేపీయే గెలిచింది. ఈ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు(సావ్లి, వఘోదియా, వడోదర షహెర్, సయజిగంజ్, అకోట, రావుపుర, మంజల్‌పూర్‌) ఉన్నాయి.

మేనకా గాంధీ అడ్డా


ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్‌ గాంధీ సతీమణి మేనకా గాంధీ సొంత నియోజకవర్గంగా పేరు పొందింది ఫిలిబిత్‌. అంతే కాకుండా దేశంలో ఒక మహిళను ఐదు కంటే ఎక్కువ సార్లు పార్లమెంటుకు పంపిన ఘనత కూడా ఈ నియోజకవర్గానిదే. ప్రారంభంలో వరసగా మూడు సార్లు ఇక్కడ ప్రజా సోషలిస్టు పార్టీ (పీఎస్‌పీ) గెలిచింది. తర్వాత నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. 1989 నుంచి మేనకాగాంధీ ఇక్కడ నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఆమె వివిధ పార్టీల అభ్యర్థి, ఇండిపెండెంటుగా పోటీ చేసినా గెలవడం విశేషం.1991లో అయోధ్య ప్రభావంతో జనతాదళ్‌ తరఫున పోటీ చేసిన మేనకా గాంధీ బీజేపీ చేతిలో ఓడిపోయారు. తర్వాత ఆమె బీజేపీలో చేరారు. 2004, 2014లలో మేనకాగాంధీ బీజేపీ టికెట్టుపై ఇక్కడ పోటీ చేసి గెలిచారు. 2009లో మేనకాగాంధీ కుమారుడు వరుణ్‌ గాంధీ ఈ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో ఆమె అవోన్లా నుంచి గెలిచారు. గత ఎన్నికలో ఆమె సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి బద్సేన్‌ వర్మపై 3,07,052 ఓట్ల ఆధిక్యతతో ఈ స్థానం నుంచి గెలిచారు.

శరద్‌ పవార్‌దే పవర్‌


మహారాష్ట్రలోని మరో కీలక నియోజకవర్గం బారామతి. ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలతో(దవుంద్, ఇండపూర్, బారామతి, పురందర్, భోర్,  కథక్వశాల) కూడిన ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత సుప్రియా సూలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చిన శరద్‌ పవార్‌ ఈ పార్టీని స్థాపించారు. 1957 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో 9 సార్లు కాంగ్రెస్‌పార్టీ విజయం సాధించింది. శరద్‌పవార్‌ 1984లో ఇండియన్‌ కాంగ్రెస్‌ (సోషలిస్ట్‌) తరఫున పోటీ చేసి నెగ్గారు. 1991 ఉప ఎన్నికల నుంచి 1998 వరకు ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 1999 నుంచి 2004 వరకు  నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలిచారు. 2009 నుంచి ఆయన కుమార్తె సుప్రియ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆమె ఆర్‌ఎస్‌పీఎస్‌ అభ్యర్థి మహదేవ్‌ జగన్నాథ్‌ జంకార్‌పై 69,719 ఓట్ల ఆధికత్య సాధించారు.

పట్నా సాహిబ్‌.. సిన్హా


బిహార్‌ రాజధాని పట్నా జిల్లాలో ఉందీ నియోజకవర్గం. 2008 వరకు రాజధాని పట్నా ఒకే నియోజకవర్గంగా ఉండేది. ఆ సంవత్సరం నియోజకవర్గాల పునర్‌ వ్యవస్థీకరణలో దీనిని రెండు నియోజకవర్గాలు చేశారు. ఒకటి పట్నా సాహిబ్‌ కాగా రెండోది పాటలీపుత్ర (బిహార్‌ను పూర్వ పాటలీపుత్రం అని పిలిచేవారు). దీని పరిధిలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు (భక్తియార్‌పూర్, దిఘ, బంకిపూర్, కుమ్‌రార్, పట్న సాహిబ్, ఫతుహ) ఉన్నాయి. బీజేపీ తరఫున శత్రుఘ్న సిన్హా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009 ఎన్నికల్లో కూడా ఈయనే గెలిచారు. గత ఎన్నికల్లో శత్రుఘ్న సిన్హా కాంగ్రెస్‌ అభ్యర్థి కునాల్‌ సింగ్‌పై 2,65,805 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

మరిన్ని వార్తలు