ప్రత్యక్ష ప్రసారమే పరిష్కారం

20 May, 2018 05:54 IST|Sakshi

న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ప్రొటెంస్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే కేజీ బోపయ్యను నియమించడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్‌–జేడీఎస్‌ల దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అదే సమయంలో బలపరీక్ష సందర్భంగా పాటించాల్సిన మార్గదర్శకాలపై కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ‘యడ్యూరప్ప బలనిరూపణను అన్ని చానళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయాలి. అసెంబ్లీ కార్యకలాపాలు పారదర్శకంగా కొనసాగేందుకు ఇది అత్యుత్తమ మార్గం’ అని సుప్రీంకోర్టు బెంచ్‌ పేర్కొంది. సభలో జరిగే కార్యకలాపాలను రికార్డు చేయాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. బోపయ్యను ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తూ గవర్నర్‌ జారీ చేసిన ఉత్తర్వుల్ని కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమి శుక్రవారం రాత్రి సుప్రీంలో సవాలుచేయడం తెల్సిందే. ఆ పిటిషన్‌పై విచారణను కొనసాగించాలంటే ప్రొటెం స్పీకర్‌ వాదనను వినాల్సి ఉంటుందని, దాంతో బలపరీక్ష వాయిదా పడుతుందని ధర్మాసనం స్పష్టం చేయడంతో కాంగ్రెస్‌–జేడీఎస్‌లు వెనక్కి తగ్గాయి.

గవర్నర్‌ను ఆదేశించలేం: సుప్రీం
సభలో అత్యంత సీనియర్‌ ఎమ్మెల్యేని ప్రొటెం స్పీకర్‌గా నియమించాలన్న సంప్రదాయాన్ని పక్కనపెట్టారని కాంగ్రెస్‌–జేడీఎస్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదించారు.    సిక్రీ జోక్యం చేసుకుంటూ.. ‘అది సంప్రదాయం మాత్రమే. ప్రొటెం స్పీకర్‌గా అత్యంత సీనియర్‌ను నియమించమని మేం గవర్నర్‌ను ఆదేశించలేం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు