సికింద్రాబాద్‌ నుంచి కిషన్‌రెడ్డి

22 Mar, 2019 01:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి పోటీకి దిగనున్నారు. ఈ స్థానం నుంచి టికెట్టు ఆశించిన సిట్టింగ్‌ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయకు నిరాశే ఎదురైంది. ఇక రెండ్రోజుల క్రితం పార్టీలో చేరిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి డీకే అరుణ మహబూబ్‌నగర్‌ నుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో 10 మందితో కూడిన తొలి జాబితాను బీజేపీ అధిష్టానం గురువారం ప్రకటించింది. ఈ నెల 16, 19, 20 తేదీల్లో సమావేశమైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ తెలంగాణలోని అన్ని స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేసినా ప్రస్తుతానికి తొలి జాబితాలో పదిమందికి మాత్రమే చోటుకల్పించింది. ఇక నిజామాబాద్‌ స్థానం నుంచి డి.అరవింద్‌ పోటీ చేయనున్నారు. కరీంనగర్‌ స్థానం నుంచి పోటీకి బండి సంజయ్‌ వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్‌ స్థానం నుంచి పోటీ చేసిన బండి సంజయ్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి గట్టి పోటీనిచ్చారు. ఇప్పుడు సంజయ్‌ను ఆ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిపితే మంచి ఫలితాలు సాధించొచ్చని పార్టీ అధిష్టానం భావిస్తోంది.

బీజేపీ తొలి జాబితా..
స్థానం        అభ్యర్థి పేరు
కరీంనగర్‌: బండి సంజయ్‌
నిజామాబాద్‌: డి. అరవింద్‌
మల్కాజిగిరి: ఎన్‌ రామచంద్రరావు
సికింద్రాబాద్‌: కిషన్‌ రెడ్డి
మహబూబ్‌నగర్‌: డీకే అరుణ
నాగర్‌కర్నూల్‌ (ఎస్సీ): బంగారు శ్రుతి
నల్లగొండ: గార్లపాటి జితేంద్రకుమార్‌
భువనగిరి: పీవీ శ్యామ్‌సుందర్‌ రావు
వరంగల్‌: చింతా సాంబమూర్తి
మహబూబాబాద్‌: హుస్సేన్‌నాయక్‌

విశాఖపట్నం నుంచి పురందేశ్వరి..
ఇక ఏపీలో రెండు స్థానాలకు బీజేపీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు, విశాఖపట్నం నుంచి సిట్టింగ్‌ ఎంపీ హరిబాబు స్థానంలో బీజేపీ మహిళా మోర్చా ఇన్‌చార్జ్‌ దగ్గుబాటి పురందేశ్వరికి పార్టీ టికెట్లు దక్కాయి. 
 

మరిన్ని వార్తలు