విపక్షాలకు సమస్యలే కరువయ్యాయి

1 Aug, 2019 01:52 IST|Sakshi
ఇన్సూరెన్స్‌ కంపెనీ ప్రతినిధులకు చెక్కును అందజేస్తున్న కేటీఆర్‌. చిత్రంలో టీఆర్‌ఎస్‌ నేతలు

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎద్దేవా 

ఎన్నికల్లోనే వారికి సమాధానం చెబుతాం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని విపక్షాలకు లేవనెత్తేందుకు సమస్యలు, అంశాలే కరువయ్యాయని, ఏమి చేయాలో వాటికి అంతుబట్టడం లేదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ఎలాంటి ఎన్నికలు వచ్చిన టీఆర్‌ఎస్‌దే గెలుపనే విషయం విపక్షాలకు సైతం అర్థమైందన్నారు. ప్రస్తుతం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే పనిలో ఉన్నామని, అన్ని గ్రామ, మండల కమిటీలను పటిష్టం చేస్తున్నట్టు చెప్పారు. ఎంత అరిచినా విపక్షాల విమర్శలు పట్టించుకోబోమన్నారు. కమిటీల ఏర్పాటు తర్వాత కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలను ప్రారంభిస్తామని, దేశంలోనే క్రమశిక్షణ కలిగిన పార్టీగా టీఆర్‌ఎస్‌ను తయారు చేస్తామన్నారు. ఎన్నికల్లోనే విపక్షాలకు తగిన సమాధానం చెబుతామని, రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు సహజమన్నా రు. బీజేపీ పని బీజేపీ చేస్తుందని, తమ పని తాము చేస్తున్నామని చివరికి ప్రజల పని ప్రజలు చేస్తారని అన్నారు. అయితే, కాంగ్రెస్‌ వాళ్లు గతంలో కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారని, గెలవకపోతే కొం దరు గడ్డాలు కూడా తీసేది లేదని శపథాలు చేశారని, చివరికి ఏం జరిగిందో చూశామన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడు తూ మున్సిపల్‌ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.  

50 లక్షలకు చేరుకున్న సభ్యత్యం... 
గత నెల 27న ప్రారంభించిన టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు జూలై 31 నాటికి 50 లక్షలకు చేరుకుందని కేటీఆర్‌ చెప్పారు. పార్టీ కార్యకర్తలకు 2014–15 నుంచి ప్రమాదబీమా సౌకర్యం కల్పిస్తున్నామని, రూ.2 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా సదుపాయం కల్పించేందుకు వీలుగా యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ ప్రతినిధులకు రూ.11.21 కోట్ల విలువైన చెక్కును అందజేశామన్నారు. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ తమకు తండ్రి లాంటి వారని ఆయనను మర్యాదపూర్వకంగానే కలుసుకున్నానని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. 

పార్టీ పటిష్టతపై కేసీఆర్‌ సూచనలు
పార్టీ సభ్యత్వ నమోదు , పార్టీ పటిష్ఠతకు కమిటీలు వేయాలని, సంస్థాగత నిర్మాణం మీద దృష్టి పెట్టాలని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తమకు సూచించారని కేటీఆర్‌ చెప్పారు. దసరా వరకు పార్టీ కార్యాలయాల నిర్మాణం పూర్తి అయితే పార్టీ నిర్మాణం మీద, ముఖ్యంగా పార్టీ నాయకుల శిక్షణపై దృష్టి పెడతామన్నారు. హైదరాబాద్‌లో సభ్యత్వం వేగం పెంచాల్సిన అవసరం ఉందన్నారు.  

మరిన్ని వార్తలు